Telangana: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు హాట్ టాపిక్ గా మారాయి. మరీ ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో.. ప్రముఖ సినీ నటుడు, పొలిటికల్ లీడర్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించనున్నారని సంకేతాలు అందిస్తున్నారు.
Telangana: దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా రాజకీయాలు కదులుతున్నాయి. దీని కోసం ఇప్పటికే కాంగ్రెస్ ను కాదని మరో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసే దిశగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ పార్టీలను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే దేశంలోని బీజేపీయేతర పలువురు ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు లో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ విధమైన సంకేతాలు అందిస్తున్నారు. ఆదివారం నాడు ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్‌తో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే, ఆయనవెంట ప్రకాశ్ రాజ్ కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ కావడంతో పాటు ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.
తెలుగుతో పాటు ఇతర దక్షిణ భారత చిత్రాలలో నటిస్తున్న ప్రకాష్ రాజ్.. బీజేపీ వ్యతిరేక భావసారూప్యత కలిగిన ప్రాంతీయ, జాతీయ పార్టీల ఫ్రంట్‌ను ఏర్పరచడానికి కేసీఆర్ బృందంలో కీలక సభ్యుడిగా కనిపిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించాడు. ఇదే సమయంలో ఆయన కేసీఆర్ చేస్తున్న పనులను పొగడటంతో పాటు స్వయంగా ఆయన అభిమానిని అనే అభిప్రాయం వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ తన సొంత రాష్ట్రం కర్నాటకతో పాటు తమిళనాడు నాయకులతో మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నందున.. కేసీఆర్ ఆయన సేవలను వివిధ పార్టీలను కలుపుకుని పోవడం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్.. సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమి రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గతంలోనూ ప్రకాశ్ రాజ్ ఈ తరహా ప్రయోగాల్లో పాలుపంచుకుననారు. 2018లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ఆయన కేసీఆర్‌తో కనిపించారు.
బెంగళూరులో మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడను కేసీఆర్ కలిసినప్పుడు ప్రకాష్ రాజ్ అక్కడే ఉన్నారు. ఏప్రిల్ 2018లో జరిగిన ఈ సమావేశానికి కొన్ని రోజుల ముందు.. ప్రకాశ్ రాజ్.. టీఆర్ఎస్ అధినేతతో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల కొత్త ఫ్రంట్‌ను ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను గురించి చర్చించారు. ఇక ప్రకాష్ రాజ్ 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విఫలమయ్యారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యున్నత సంస్థ అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ సమయంలో టీఆర్ఎస్ ఆయన పరోక్షంగా మద్దతు ఇచ్చిందనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వంపై తనకు గట్టి నమ్మకం ఉందని చెప్పుకునే ప్రకాష్ రాజ్, 2014 నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర దాడి చేయడానికి వివిధ వేదికలను ఉపయోగించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి జరిగిన 2020 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్‌ను టీఆర్ఎస్ రాజ్యసభకు పంపబోతున్నదని ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మున్ముందు టీఆర్ఎస్-ప్రకాశ్‌రాజ్‌ల బంధం ఎటువైపు సాగుతుందో.. !
