తనపై దాడి చేసింది మంత్రి కేటీఆర్ మనిషేనని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. రైతులు, నిరుద్యోగులకు అండగా వుంటామని.. మీపై నమ్మకం లేకనే రైతులు తనను ఆశ్రయించారని కేఏ పాల్ వెల్లడించారు

తనపై జరిగిన దాడిపై స్పందించారు మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) వ్యవస్థాపకుడు కేఏ పాల్ (ka paul ) . నిన్న 20 మంది పోలీసులు వచ్చి తనను ఆపారని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి డీఎస్పీ, సీఐ వచ్చారని .. తనను కొట్టిన వ్యక్తితతో పోలీసులు బ్లూటూత్‌లో మాట్లాడారని కేఏ పాల్ తెలిపారు. తనను కొట్టింది మంత్రి కేటీఆర్ (ktr) మనిషని.. తాను రైతులను దూషించలేదని ఆయన చెప్పారు. పోలీసులు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని.. తనను ఎంతకాలం బంధిస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులకు అండగా వుంటామని.. మీపై నమ్మకం లేకనే రైతులు తనను ఆశ్రయించారని కేఏ పాల్ వెల్లడించారు.

నిన్న తాను పీకేతో మాట్లాడానని.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు 28 సీట్ల కన్నా ఎక్కువ రావని పీకే చెప్పారని కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్‌తో పార్టీ పెట్టమని కేసీఆరే చెప్పారని.. పార్టీ పెట్టి అన్ని పార్టీలను కలుపు అని చెప్పారని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభలకు అనుమతి ఇచ్చి తనకెందుకు ఇవ్వరని కేఏ పాల్ ప్రశ్నించారు. మళ్లీ సిరిసిల్ల వస్తున్నానని. దమ్ముంటే ఆపాలని ఆయన సవాల్ విసిరారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే వుంటానని.. తనకు 18 పార్టీల మద్ధతు వుందని కేఏ పాల్ స్పష్టం చేశారు. 

కాగా.. Siddipet జిల్లాలోని Jakkapur లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA Paul పై సోమవారం నాడు దాడికి కొందరు ప్రయత్నించారు. రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఈ విషయమై తమకు సమాచారం రావడంతో రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా కేఏ పాల్ చెప్పారు. అయితే కేఏ పాల్ పర్యటన విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. రాజన్న సిరిసిల్లకు వెళ్లే మార్గంలో కేఏ పాల్ ను అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. 

ఈ దాడి జరిగిన తర్వాత వెంటనే పోలీసులు కేఏ పాల్ ను కారులో కూర్చోబెట్టి అక్కడి నుండి పంపించి వేశారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదని పాల్ విమర్శలు చేశారు. తనపై దాడి వెనుక కేసీఆర్, కేటీఆర్ లు ఉన్నారని ఆయన ఆరోపించారు. తనను చంపించేందుకు కేటీఆర్, కసీఆర్ లు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ బండారం బయటపెడుతున్నందుకే తనపై దాడి చేశారన్నారు.