బ్రహ్మణులపై వరాల జల్లు కురిపిస్తున్న తెలుగు సీఎంలు
ఇద్దరు చంద్రులు సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణుల వెంటపడ్డారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన స్థాయిలోవున్న బ్రాహ్మణుల కమ్యూనిటీని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రులు. ఈ విషయంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో బ్రాహ్మణ సంఘం నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్, వారికోసం బ్రాహ్మణ సదన్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రిటైల్ ఆపరేషన్స్ ప్రారంభోత్సవానికి మంగళవారం రాత్రి వెళ్లిన సీఎం చంద్రబాబు, పనిలోపనిగా బ్రాహ్మణ కమ్యూనిటీని ఆకాశానికి ఎత్తేశారు.
బ్రాహ్మణులు స్వతహాగానే తెలివైనవాళ్లని, గౌరవించాల్సిన అవసరం ఎంతైనా వుందని చెప్పుకొచ్చారు. సొసైటీకి ఆర్థికపరమైన తోడ్పాటు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు. మూడేళ్ల కిందట ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’కు శ్రీకారం చుట్టిన చంద్రబాబు, టీడీపీ రూలింగ్‌లోకి వస్తే కార్పస్ ఫండ్ బ్రాహ్మణ కమ్యూనిటీకి 500 కోట్ల కేటాయిస్తామని వాగ్దానం ఇచ్చారు.. బడ్జెట్‌లో ఆ కమ్యూనిటీకి కేటాయింపులు సంగతి పక్కనబెడితే.. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణారావుని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. మొత్తానికి బ్రాహ్మణ ఓటు బ్యాంకు పక్కదారి పట్టకుండా ఇద్దరు చంద్రులు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.
