తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించింది.

బహదూర్‌పురాకు చెందిన అసిఫ్ అలీఖాన్ ఐదేళ్లుగా ప్రగతి భవన్‌ డాగ్ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడున్న 9 పెంపుడు కుక్కులను చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు.

ఈ నెల 10న హస్కీ అనే 11 నెలల కుక్క పిల్ల అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన వైద్యం చేశాడు. దీంతో కుక్కపిల్ల కొంచెం కోలుకుంది.  తిరిగి సాయంత్రం 6 గంటలకు మళ్లీ కుక్క అనారోగ్యానికి గురై ఆహారం తీసుకోవడం మానేసింది.

ఈ నెల 11న ఉదయం 7 గంటలకు పాలు కూడా తాగలేక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీనిని ఆయన వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌కు వచ్చిన వైద్యుడు పరీక్షలు నిర్వహించగా కుక్క 101 టెంపరేచర్ జ్వరంతో బాధపడుతుండటంతో లివర్ టానిక్ ఇచ్చాడు. దీంతో కుక్క పరిస్థితి మరింత విషమించింది.

ఈ క్రమంలో అదే రోజు రాత్రి 9 గంటలకు అలీఖాన్ హస్కీని తీసుకుని బంజారాహిల్స్ రోడ్ నెం.4లోని యానిమల్ క్లినిక్‌కు తీసుకెళ్లి డాక్టర్ రంజిత్‌కు చూపించాడు. వైద్యుడు చికిత్స ఇస్తుండగానే కుక్క చనిపోయింది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అలీఖాన్.. డాక్టర్ రంజిత్ నిర్లక్ష్యం కారణంగానే కుక్క చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.