Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్.. ఇక్క‌డ‌ అన్ని ప‌రీక్ష‌ల ప‌త్రాలు దొరుకుతాయ్.. !

Hyderabad: హైద‌రాబాద్ లోని నాంపల్లిలో టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇప్ప‌టికే టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప‌రీక్ష‌లు ర‌ద్దు, సిట్ ఏర్పాటుతో ప్ర‌భుత్వం ముందుకుసాగడంపై ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్య‌ర్థులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Posters calling TSPSC xerox centre come up in Hyderabad RMA
Author
First Published Mar 22, 2023, 8:03 PM IST

TSPSC: టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీ వ్యవహారం మ‌రింత‌గా ముదురుతోంది. ఇప్ప‌టికే రాజ‌కీయంగా అధికార-ప్ర‌తిప‌క్ష పార్టీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అభ్య‌ర్థులు సైతం ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే హైదరాబాద్ లో TSPSC Xerox Center పోస్ట‌ర్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నాంపల్లిలో టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ నాంపల్లిలో పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఓయూ జేఏసీ) చైర్మన్ అర్జున్ బాబు పేరుతో ఉన్న పోస్టర్లను టీఎస్‌పీఎస్సీ కార్యాలయం గేటు వద్ద అంటించారు. పరీక్షా పత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రభుత్వానికి, వారి నిర్ణయాలకు ఈ పోస్టర్లు పలు ప్రశ్నలు సంధించాయి.

పోస్ట‌ర్లలోని వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పెద్ద అక్ష‌రాల‌తో టీఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంట‌ర్ మ‌ధ్య లోగో, దాని కింద చిన్న అక్ష‌రాల‌తో "ఇక్క‌డ అన్ని ర‌క‌ముల ప్ర‌భుత్వ ఉద్యోగ ప్ర‌వేశ ప్ర‌శ్న‌ప‌త్రాలు ల‌భించును" అని ఉంది. పేప‌ర్ల లీకేజీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప‌లు ప్ర‌శ్న‌లు కూడా ప్ర‌భుత్వానికి సంధించారు. త‌ప్పు చేసిన టీఎస్‌పీఎస్సీ బోర్డును ర‌ద్దు చేయ‌కుండా కేవ‌లం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌డమ‌నే శిక్ష ఎవ‌రికీ.. బోర్డుకా?  విద్యార్థుల‌కా? అంటూ ప్ర‌శ్న‌లు గుప్పించారు. ఇది ప్ర‌స్తుత తెలంగాణ ప్ర‌భుత్వ తీరు అంటూ మండిప‌డ్డారు. 

దీంతో పాటు పోస్ట‌ర్ల‌లో ప‌లు డిమాండ్ల‌ను కూడా ప్ర‌స్తావించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) వెంట‌నే రాష్ట్ర విద్యార్థుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ల లీకేజీలో త‌మ ప్ర‌భుత్వ, సీఎం కుటుంబ పాత్ర లేద‌ని నిరూపించుకోవాల‌నీ, దీని కోసం పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారాన్ని సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో పాటు టీఎస్‌పీఎస్సీ బోర్దును, సంబంధిత శాఖ మంత్రిని వెంట‌నే భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని పేర్కొన్నారు. అలాగే, ప‌రీక్ష‌ల ర‌ద్దు, లీకేజీ కార‌ణంగా న‌ష్ట‌పోయిన విద్యార్థుల‌కు ఈ నెల నుంచే మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే వ‌ర‌కు 10 వేల రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios