సాత్విక్ మృతదేహానికి ఉస్మానియాలో పోస్ట్‌మార్టం పూర్తి.. భారీ భద్రత మధ్య స్వగ్రామానికి

నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయ్యింది

post mortem completed for inter student satwik dead body in osmania hospital

నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. అనంతరం అతని మృతదేహాన్ని ఉస్మానియా నుంచి షాద్‌నగర్‌కు తరలించారు. భారీ బందోబస్త్ మధ్య సాత్విక్ మృతదేహాన్ని తరలించారు. 

హైదరాబాదు నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో క్లాస్ రూంలోనే సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో వేధింపుల వల్ల మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాత్విక్ ను కాలేజీలో కొట్టేవారని,దానితో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తోటి విద్యార్ధులు అంటున్నారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉరి వేసుకున్న సాత్విక్ ను ఆస్పత్రికి తరలించడానికి కూడా యాజమాన్యం ముందుకు రాలేదని, తామే బయట వరకు మోసుకుని వచ్చి బైకర్ ను లిఫ్ట్ అడిగి అస్పత్రికి తరలించామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించి మరో హాస్టల్ కు తరలిస్తున్నారు.

Also REad: అవే సాత్విక్ చివరి మాటలు: కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి రాజు

మరో వైపు ఇవాళ ఉదయం కాలేజీ ముందు సాత్విక్ పేరేంట్స్ ఆందోళన నిర్వహించి.. తమకు న్యాయం చేయాలని  డిమాండ్  చేశారు. ఆందోళన చేస్తున్న సమయంలోనే  సాత్విక్ తల్లి  స్పృహ తప్పి పడిపోయింది. సాత్విక్  మృతదేహన్ని  పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. సాత్విక్ మృతికి కారణమైన శ్రీచైతన్య కాలేజీ గుర్తింపును రద్దు  చేయాలని డిమాండ్  చేస్తూ  ఇంటర్ బోర్డు ముందు  ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. గతంలో కూడా ఈ కాలేజీకి చెందిన  పలు క్యాంపస్ లలో  విద్యార్ధులు మృతి చెందారని ఎస్ఎఫ్ఐ నేతలు గుర్తు  చేస్తున్నారు. విద్యార్ధుల మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్  చేసింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios