అవే సాత్విక్ చివరి మాటలు: కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి రాజు
సాత్విక్ తో మాట్లాడి వచ్చిన రెండు గంటలకే ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి రాజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
హైదరాబాద్: తాను తన కొడుకుతో మాట్లాడి ఇంటికి వచ్చిన రెండు గంటల తర్వాతే సాత్విక్ కు సీరియస్ అంటూ స్నేహితుల ద్వారా సమాచారం అందిందని సాత్విక్ తండ్రి రాజు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో మంగళవారంనాడు రాత్రి ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్ సాత్విక్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో సాత్విక్ పేరేంట్స్, విద్యార్ధులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.
కాలేజీ హస్టల్ వద్దకు సాత్విక్ తండ్రి రాజు వెళ్లాడు. నిన్న రాత్రి సాత్విక్ వద్దకు తాను వెళ్లినట్టుగా రాజు చెప్పాడు. గత మూడు రోజులుగా సాత్విక్ తనను రావాలని కోరినట్టుగా రాజు గుర్తు చేసుకున్నాడు. సాత్విక్ కు అవసరమైన మందులను కూడా తాను ఇచ్చినట్టుగా రాజు గుర్తు చెప్పాడు.. తల్లి, సోదరుడితో సాత్విక్ ఫోన్ లో మాట్లాడినట్టుగా రాజు తెలిపారు. తాను ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సాత్విక్ స్నేహితుడి తండ్రి నుండి తనకు ఫోన్ వచ్చినట్టుగా రాజు మీడియాకు చెప్పారు. మీరు ఇంటికి వెళ్లండి... నేను భోజనం చేసి పడుకుంటానని చెప్పిన సాత్విక్ శాశ్వతంగా తమ కు దూరమయ్యాడని రాజు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తనతో మాట్లాడే సమయంలో సాత్విక్ కొంత డిప్రెషన్ లో ఉన్నట్టుగా అన్నించిందన్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని తనకు సమాధానమిచ్చాడని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. గత వారం రోజులుగా సాత్విక్ డిప్రెషన్ లో ఉన్నాడని స్నేహితులు తనకు ఇవాళ చెబుతున్నారని రాజు ఆవేదన చెందుతున్నారు.
మీ అబ్బాయికి సీరియస్ గా ఉందని అతను ఫోన్ లో సమాచారం ఇచ్చాడని రాజు తెలిపారు. తాను సాత్విక్ తో మాట్లాడి వచ్చిన గంటన్నర సేపటికే ఈ ఫోన్ రావడంతో ఏం జరిగిందో అర్ధం కాలేదన్నారు. సాత్విక్ గురించి కాలేజీ యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.
also read:నార్సింగి శ్రీచైతన్య కాలేజీ స్టూడెంట్ సాత్విక్ మృతిపై కేసు: స్పృహ తప్పిన తల్లి
సాత్విక్ స్నేహితులే చేతులపై మోసుకొంటూ తీసుకెళ్లారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒక బైకర్ ను లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. ఆసుపత్రికి వెళ్లేలోపుగానే సాత్విక్ మృతిచెందాడని రాజు చెప్పారు. కాలేజీ లో లెక్చరర్ల వేధింపులే సాత్విక్ మృతికి కారణమని ఆయన ఆరోపించారు.