కేసిఆర్ సర్కారుకు కొత్త సెగ పుట్టించనున్న జర్నలిస్టులు

post card movement by telangana  journalists demanding house sites
Highlights

హాట్ న్యూస్...

తెలంగాణ జర్నలిస్టులు కేసిఆర్ సర్కారుకు కొత్త సెగ పుట్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ  వివరాలు చదవండి.

జర్నలిస్టుల ఇళ్ళస్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని పలువురు ఎడిటర్లు, సీనియర్ పాత్రికేయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జాప్యం చేయడం సరైంది కాదని వారన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల హౌసింగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (జేహెచ్ సీసీ) నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు నగేష్ కుమార్, బండారు శ్రీనివాస్ రావు, సదాశివశర్మ,కోనేటీ రంగయ్య, ఎన్.కొండయ్య, గోవింద రెడ్డి, ఎన్.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఇళ్ళస్థలాల సమస్యపై తీవ్ర ఆందోళనతో వున్నారని, ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని అన్నారు. జర్నలిస్టుల ఇళ్ళస్థలాల అంశం సుప్రీం కోర్టులో వున్నప్పటికీ ఆ కేసుకు సంబంధం లేకుండా న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఇళ్ళస్థలాల కోసం చాలామంది జర్నలిస్టులు ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్నారని, కొంతమంది ఇంటి స్థలం పొందకుండానే చనిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్ళస్థలాల సమస్యను పరిష్కరించుకునేందుకు సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు,అన్ని జర్నలిస్టు సంఘాలు సమిష్టిగా శాంతియుతంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాలని అన్నారు. కమిటీ అధ్యక్షులు దిలీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ కో-ఆర్డినేటర్లు వెంకటాచారి, ఎం ఎస్.హాష్మీ, బి.బసవపున్నయ్య (టీడబ్ల్యూజేఎఫ్), విరాహత్ అలీ (టీయూడబ్ల్యూజే), రాజమౌళి చారి, మీడియా కో-ఆర్డినేటర్ మామిడి సోమయ్య, హన్స్ ఇండియా బిజినెస్ ఎడిటర్ మధుసూదన్ రెడ్డి, ఖయీఖుద్దీన్ (టీయూడబ్ల్యూజేయూ), జనపక్షం ఎడిటర్ పి.జంగారెడ్డి, సీనియర్ పాత్రికేయులు సృజన్ కుమార్, కేసీఆర్.సురేష్, బి.గోపరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ళస్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయాలని సమావేశం తీర్మానించింది.అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నపంతో ఉత్తరాలు పోస్ట్ చేసే కార్యక్రమం చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.

loader