కాంగ్రెస్ వీడిన పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్
కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని కోరినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదనను పొన్నాల తిరస్కరించినట్టు కథనాలు వస్తున్నాయి.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పై అసంతృప్తితో బీఆర్ఎస్‌లోకి చేరిన సీనియర్ లీడర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లింది. ఆయనను పార్టీలోకి తిరిగి రావాలని కోరినట్టు విశ్వసనీయం సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ట్విస్ట్ ముందుకు వచ్చింది.
కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన కీలక నేతలను తిరిగి వెనక్కి తెచ్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. ముఖ్యంగా బీసీ నేతలను మళ్లీ రప్పించుకోవాలని అనుకుంటున్నది. బీసీలు ఎన్నిలక ఫలితాలను శాసించే స్థాయిలో ఉన్నారు. బీసీలను ఆకర్షించడానికి బీఆర్ఎస్, బీజేపీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీసీ నేతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రంగంలోకి దూకుతున్నది.
ఇందులో భాగంగానే పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. ఆయనను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని రాహుల్ గాంధీ కోరినట్టు సమాచారం. అయితే, ఆ ప్రతిపాదనను పొన్నాల లక్ష్మయ్య తిరస్కరించినట్టు తెలిసింది.
Also Read: అసెంబ్లీ వద్దు, పార్లమెంటే ముద్దు!.. తెలంగాణ బీజేపీ సీనియర్ల తీరు.. ఎందుకంటే?
బీసీ నేతలకు ఒకప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, అలాంటిది ఈ రోజు తాను పార్టీ వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఆఫీసుకు బీసీ నేతలు గుర్తుకు వస్తున్నారా? అని పొన్నాల నిలదీసినట్టు సమాచారం.