ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు.
ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు తెల్లం వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. తాను బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. భద్రాచలం అభివృద్ది కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని తాను నమ్ముతున్నట్టుగా తెలిపారు.
‘‘గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీ ఓడిపోయాను. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా నేను కాంగ్రెస్ గూటికి చేరాను. అయితే ఆ సిద్దాంతాలు నచ్చక తిరిగి బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయించుకున్నాను. నాతో వచ్చిన కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అని తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు.
ఇక, తెల్లం వెంకట్రావు మొదటి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. 2014లో మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన తెల్లం వెంకట్రావు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెల్లం వెంకట్రావు.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఇటీవల ఖమ్మం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటితో పాటు తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి భద్రాచలం నుంచి మరోసారి పోటీ చేయాలని చూస్తున్న వెంకట్రావు ఆ దిశలో సంకేతాలు కనిపించకపోవడంతో నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొదెం వీరయ్యకే కాంగ్రెస్ పార్టీ మరోసారి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెల్లం వెంకట్రావు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.
