లడ్డూ వేలంలో రాజకీయ పార్టీలు.. హోరాహోరీ పోరులో రూ.36 లక్షలకు దక్కించుకుంది ఏ పార్టీ అంటే...
లడ్డూ వేలంలో రాజకీయపార్టీలు హోరాహోరీ పోటీ పడ్డ ఘటన నల్గొండలో వెలుగు చూసింది. చివరికి స్థానిక ఎమ్మెల్యే మద్దతుదారుడు అత్యంత భారీ మొత్తానికి ఆ లడ్డూను దక్కించుకున్నాడు.

నల్గొండ : వినాయకచవితి వచ్చిందంటే.. ఆ తొమ్మిదిరోజులూ ఊరు మొత్తం గణపతి మండపమే అవుతుంది. చిన్నాపెద్దా అక్కడికే చేరి కోలాహలం సృష్టిస్తారు. ఇక వినాయకుడికి వీడ్కోలు చెప్పేముందు జరిగే లడ్డూ వేలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది రోజుల పాటు గణనాథుడితోపాటూ నిత్యం పూజలందుకున్న ఆ లడ్డూని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
అందుకే లడ్డూను దక్కించుకోవడానికి పోటీ పడతారు. వేలంపాటను లక్షలకు పెంచేస్తారు. బాలాపూర్ లడ్డూ దీనికి ఎంతో ప్రసిద్ధి. ఇక నిన్న హైదరాబాద్ లో జరిగిన లడ్డూ వేలాల్లో రిచ్మండ్ విల్లాలోని గణపతి లడ్డూ రికార్డు ధరలో కోటీ 20 లక్షలకు అమ్ముడుపోయింది. ఇలాంటి ఘటనే నల్గొండలో వెలుగు చూసింది. అయితే.. ఈ లడ్డూను దక్కించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీల వారూ.. పార్టీలకు అతీతంగా పోటీ పడడం చెప్పుకోవాల్సిన విషయం.. నల్గొండలోని ‘నం. 1' గణేశ మండపంలో.. ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా ప్రతిష్టాత్మకమైన లడ్డూను కొనుగోలు చేయడానికి వేలంలో పాల్గొన్నారు.
Telangana Cabinet: ఇంకా జ్వరంతో బాధపడుతున్న గులాబీ బాస్.. నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా..
చివరికి నల్గొండ ఎమ్మెల్యే కే భూపాల్ రెడ్డి మద్దతుదారుడైన కరణం జయరాజ్ ఈ వేలంలో విజయవంతమయ్యాడు. రూ. 36 లక్షలతో లడ్డూ దక్కించుకున్నాడు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల నుంచి జయరాజ్ కు గట్టి పోటీనే ఎదురయ్యింది. ఈ పోటీలో వీరందరినీ ఎదుర్కుని విజయం సాధించాడు జయరాజ్.. "హనుమాన్ నగర్‌లో పండల్‌ను ఏర్పాటు చేయడానికి 15 రోజుల ముందు, ఈ సారి లడ్డూ కోసం వేలం వేయాలని నిర్ణయించుకున్నాం.
అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆసక్తి చూపడంతో వేలం మొత్తం పెరుగుతూ వచ్చింది" అని జయరాజ్ చెప్పారు. బాలాపూర్ లడ్డూ కంటే ఇక్కడి లడ్డూ వేలంలో ఎక్కువ ధర పలికింది. పండల్ ఏర్పాటు చేసినప్పుడు, లాట్ల డ్రాలో, విగ్రహం ఏర్పాటుకు 2 లక్షలు ఖర్చు చేయడానికి కోమటిరెడ్డి పేరు వచ్చింది. విగ్రహం, పండల్ స్పాన్సర్ చేసే అవకాశం రాని భూపాల్‌రెడ్డి లడ్డూను వేలంపాటలో ఎలాగైనా విజయవంతంగా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
బీజేపీ నేత నాగం పరిషత్ రెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడు పి.రాజరాజు యాదవ్ కూడా లడ్డూను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వేలంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం శుభపరిణామమని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి రాజకీయ పార్టీ కీలకపాత్ర పోషించడం కూడా ముఖ్యమని భూపాల్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఈ ఏడాది 1200కు పైగా విగ్రహాలను ప్రతిష్టించారు.