Asianet News TeluguAsianet News Telugu

వీక్లీ రౌండప్: నడ్డా పర్యటనతో తెలంగాణలో కారు vs కమలం వార్

బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి తెలంగాణ పర్యటన ఈ వారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ను పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నడ్డా విమర్శలు గుప్పించారు.

Political Heat between TRS & BJP in Telangana after JP Nadda Visit
Author
Hyderabad, First Published Aug 25, 2019, 11:46 AM IST

బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి తెలంగాణ పర్యటన ఈ వారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ను పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నడ్డా విమర్శలు గుప్పించారు.

కేంద్రం ఇస్తామంటే.. కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్ట్‌ను తీసుకోలేదని, రూ.1,400 కోట్ల బకాయిలు ఉండటంతో ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలుకావడం లేదన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల తెలంగాణలో 26 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ లబ్ధిని కోల్పోయారని నడ్డా ఫైరయ్యారు.

కేసీఆర్ మహారాజులా ఫీల్ అవుతున్నారని.. తాను, తన కుటుంబం అనే భావన తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని నడ్డా మండిపడ్డారు. వాస్తు బాలేదన్న కారణంతో సెక్రటేరియట్ కూల్చేస్తున్నారని.. వాస్తు కథ ఏంటో 2022లో తెలుస్తుందంటూ విమర్శించారు.

నడ్డా వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మంచి పథకమని కేటీఆర్ స్పష్టం చేశారు.

కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ ఎదగాలని చూస్తుందన్నారు. తెలంగాణలో నడ్డా పప్పులుడకవని... ఇది కర్ణాటక కాదని, తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. అటు నడ్డా పర్యటనతో ఫుల్ జోష్‌లో ఉన్న తెలంగాణ బీజేపీలోకి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు చేరారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, విజయ్‌పాల్ రెడ్డి, సదాశివపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ రామా గౌడ్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. 

ఇదిలావుండగా.. ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను ఓ అజ్ఞాత వ్యక్తి  బుక్ చేశాడు.  ఈ  కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా  గుర్తించారు.. అంతేకాదు  ఈ బాటిల్స్ నుండి దుర్వాసన రావడాన్ని గమనించారు.  

ఈ విషయాన్ని గుర్తించిన సికింద్రాబాద్ పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తొలుత అవి రసాయనాలు అనుకొని పరీక్షలు చేయగా... మురుగు నీరు అని తేలింది. కాగా... ఈ పార్శిల్స్ పంపిన వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా బీజేపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయనే స్వయంగా స్పందించారు. కొందరు పనిగట్టుకునే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను ఎవరినీ కలవడం లేదని స్పష్టం చేశారు. ఇకపై తనపై చేస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.

తన తండ్రి, టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ బీజేపీ వైపు అడుగులు వేస్తారని స్పష్టమైన సంకేతాలిచ్చారు..  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను డీఎస్ కలవడంతో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఒక క్లారిటీ రావాల్సి వుంది.

ఇక మల్కాజిగిరి రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని ముక్కలు ముక్కలుగా నరికిన కేసులో బాధితుడి భార్య, కుమారుడు, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.30 వేల పింఛన్ కోసం మారుతీ సుతార్ అనే వృద్ధుడిని కొన్ని గింజలను పొడిగా చేసి నెల రోజులుగా ఆయన తినే అన్నంలో కలపడం ప్రారంభించారు.

అయితే ఈ నెల 15న రాత్రి ఎక్కువ మొత్తంలో తినిపించారు. 16న ఉదయం ఆయన మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆరు బకెట్లలో నింపారు. ఎవరు చూడకుండా వాటిని ఆటోలో తరలించి సమీపంలోని చెరువులో పడేయాలనుకున్నారు.

రెండు రోజుల పాటు అది వీలుకాకపోవడంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించింది. స్ధానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సుతార్ ఇంటికి చేరుకుని బకెట్లలో ఉన్న శరీర భాగాలు చూసి షాక్‌కు గురయ్యారు. వీటిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి... పరారీలో ఉన్న మృతుడి కుమారుడు కిషన్, కూతురు ప్రపుళ్ల, భార్య గంగాభాయిని అరెస్ట్ చేశారు.

మహేశ్వరంలో ఒడిషాకు చెందిన మహిళ గ్యాంగ్‌రేప్ కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios