హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో వున్నారు. వీరిని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ (amnesia pub rape case) అత్యాచార ఘటనలో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు వున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత నిందతులను రిమాండ్‌కు తరలించనున్నారు పోలీసులు. మరోవైపు నిందితుల వినియోగించిన ఇన్నోవా ఆచూకీ లభ్యం కావడంతో క్లూస్ టీం నిపుణులతో ఆధారాలు సేకరించనున్నారు. ఇకపోతే.. డీజీపీ మహేందర్ రెడ్డిని (dgp mahender reddy) బీజేపీ నేతలు కలిశారు. బాలికపై అత్యాచారం కేసును సీబీఐకి బదిలీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. 

ఇక ఈ సామూహిక అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన హోం మంత్రి మహమూద్ అలీ (mahmood ali) స్పందించారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. 

Also Read:Amnesia Pub Rape Case : ఫోటోలు, వీడియోలు లీక్.. అలర్టైన పోలీసు ఉన్నతాధికారులు, అత్యవసర భేటీ

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, ఈ ఘటనలో పోలీసులపై వత్తిడి ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. వారిపై ఎలాంటి వత్తిడి లేదన్న ఆయన...మైనర్ కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మైనర్లు కావడంతోనే చర్యలకు ఆలస్యం అవుతుందని చెప్పారు. నిందితులు మైనర్లు కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పారు. తనపై వస్తోన్న ఆరోపణలు అబద్ధాలు అని చెప్పారు.

అంతకుముందు .. అమ్నేషియా పబ్‌ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (raghunandan rao) ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు మీడియా‌ను బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు నిందితులు వైపా..?, బాధితుల వైపా..? అని ప్రశ్నించారు. పోలీసులకు ధైర్యం ఉంటే.. తప్పుచేసిన వారిని భయపెట్టండి అని అన్నారు. విచారణ పూర్తి కాకముందే కొందరికి క్లీన్ చీట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్‌గా ఉంచారని ప్రశ్నించారు. నిర్బయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్నవారి పిల్లలనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చూపడం లేదని ప్రశ్నించారు. పోలీస్ కంట్రోలింగ్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. 

అత్యాచారం జరిగిన రెడ్ కలర్ మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కొడుకు బాలికపై అత్యాచారం చేశాడని చెప్పారు. కారులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. కానీ లిమిటేషన్ దృష్ట్యా ప్రపంచానికి ఎంతవరకు చూపించాలో తనకు తెలుసని అన్నారు. కొన్ని ఫొటోలను రఘునందన్ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు. అలాగే అమ్మాయి ఫొటో కనిపించకుండా ఓ వీడియోను ప్రదర్శించారు. ఈ ఫొటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా అని ప్రశ్నించారు.