న్యూఇయర్ వేడుకలు దగ్గరకు వచ్చేశాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి సంబరాల్లో మునిగి తేలడానికి యవత ఉత్సాహం చూపిస్తోంది. దానికి తగ్గట్లుగానే ఈవెంట్ మేనేజర్స్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.... ఈ ఈవెంట్స్ పై పోలీసులు కూడా ఓ కన్నేసి ఉంచారు.

మితీమీరి మద్యం సేవించి శృతి మించేలా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోమంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్స్ పై మాదాపూర్ ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడారు.హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్‌కు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

డిసెంబర్‌ 31న జరిగే పార్టీల్లో ఎలాంటి గొడవలూ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈవెంట్‌ నిర్వాహకులపై ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా భద్రతే ధ్యేయంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్ధరాత్రి వాహనాలు అతివేగంగా నడిపినా, ఇతరులను వేధింపులకు గురిచేసినా శిక్షార్హులవుతారని తెలిపారు. శృతిమించకుండా యువతీయువకులు సరదాగా గడపాలని సూచించారు.
 
నూతన సంవత్సర వేడుకల జోష్ లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా, వారిని ఇబ్బంది, వేధింపులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం మత్తులో మహిళలపై దురుసుగా ప్రవర్తించిన వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ఐటీ కారిడర్‌లో 31 నైట్‌ ఈవెంట్‌లు నిర్వహించే హోటల్స్‌, పబ్‌లు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిషేధమన్నారు. అంతేకాకుండా ఈవెంట్స్ లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.