సంగారెడ్డి : చట్టానికి ఎవరూ అతీతులు కారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఈ వ్యాఖ్యలు ఎక్కువగా నేరం జరిగిన చోట పోలీసుల వాడే డైలాగులు. డైలాగులు చెప్తారు కానీ అమలు చేస్తారేంటి అన్న సందేహం ప్రతీ ఒక్కరినోట రావడం గమనిస్తూనే ఉంటాం. 

అయితే చట్టం దృష్టిలో అంతా ఒక్కటే అని నిరూపించారు సంగారెడ్డికి చెందిన ట్రాఫిక్ పోలీసులు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు. రాంగ్ రూట్ లో డీజీపీ వాహనం వెళ్లడంతో ఫైన్ వేశారు. 
 
వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో పోలీసులు డిపార్ట్మెంట్ వాహనాన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు. రాంగ్ రూట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాహనం వెళ్లడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఆ వాహనం ఫోటో తీశాడు. 

ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేశాడు. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఫోటో ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి రావడంతో వారంతా అప్రమత్తమయ్యారు. ఈనెల 3న ఆ వాహనానికి రూ.1,135 ఫైన్ విధించారు. అయితే ఆ వాహనం తెలంగాణ డీజీపీ పేరుతో ఉండటంతో డీజీపీకి ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు.