’బ్యూటీషియన్ శిరీష‘ నిందితులకు పోలీసు కస్టడీ

police take beautician sireesha death case accused into their custody
Highlights

బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో పోలీసుల అసలు విచారణ షురూ అయింది. ఈ కేసులో నిందితులైన శ్రావణ్, రాజీవ్ లను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుంచి నిందితులిద్దరినీ తీసుకుని ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అననంతరం బంజారాహిల్స్ స్టేషన్ కు తరలించి వారిని విచారిస్తున్నారు పోలీసులు.

 

సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో ఎ 1 గా శ్రావణ్, ఎ 2 గా రాజీవ్ లను గుర్తించిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. ఈ కేసుపై అన్ని వైపుల నుంచి అనేక అంశాల్లో అనుమానాలు రేకెత్తుతున్న తరుణంలో బంజారాహిల్స్ పోలీసులు 5రోజుల కస్టడీకి కావాలని నాంపల్లి కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఈనెల 26, 27 తేదీల్లో రెండు రోజులు మాత్రమే పోలీసు కస్టడీకి అనుమతించింది. 

 

నిందితుల తరుపు లాయర్ సమక్షంలో రెండు రోజుల పాటు తమ కస్టడీలో పోలీసులు ఇంకా నివృత్తి కావాల్సిన అన్ని అంశాలను ప్రశ్నించి సమాచారం సేకరించనున్నారు. సాయంత్రం వరకు సమాచారం తీసుకున్న తర్వాత నిందితులిద్దరినీ మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. రెందో రోజు కూడా ఇదే తరహాలో జైలు నుంచి తీసుకొచ్చి విచారణ జరుపుతారు.

 

అయితే శిరీష ఆత్మహత్యపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. శిరీష తరుపు బంధువులు కీలకమైన ప్రశ్నలను లేవనెత్తారు. టవర్ లొకేషన్ తేడాగా ఉందన్న విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో పోలీసుల తీరుపైనా శిరీష కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని వారు బలంగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో శిరీష బంధువుల అనుమానాలపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పోలీసులకు ఏర్పడింది.

 

మరోవైపు అసలు ఏ తరహా  సెటిల్మెంట్ చేసుకునేందుకు రాజీవ్, శ్రావణ్ లు శిరీషను తీసుకుని కుకునూరుపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లారు అన్నది ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది. అలాగే శిరీషను కొట్టి గాయపరిచారన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. టవర్ లొకేషన్ విషయంలో పోలీసులు చెబుతున్నదానికి, కుటుంబసభ్యులు చెబుతున్నదానికి మధ్య తేడా ఉండడంతో దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.

 

ఇక ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన నవీన్, నంద విషయంలోనూ పోలీసులు మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉంది. వారితో శిరీష గంటల తరబడి ఫోనులో మాట్లాడిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజీవ్, తేజస్విని ల మధ్య రిలేషన్స్ చెడగొట్టేందుకు శిరీష వారిద్దరి సాయం కోరిందన్నట్లు వార్తలొచ్చాయి. వారిద్దరితో శిరీష మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ లను పోలీసు వర్గాల నుంచి మీడియా కు లీక్ లు అందాయి. శిరీష ఫోనులో పెద్ద సంఖ్యలో కాల్ రికార్డులు ఉన్నట్లు గుర్తించారు.

 

మరోవైపు అసలు శిరీషపై అత్యాచారం కానీ, అత్యాచార యత్నం కానీ జరిపితే అది నిజమేనా అన్నది కూడా తేలాలి. అలాగే ఆ సంఘటన ఎక్కడ జరిగిందన్నది తేలాలి. పోలీసు క్వార్టర్స్ లోనా, లేక ఫామ్ హౌస్ లో జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేయనున్నారు. అలాగే శిరీషను రాజీవ్ తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఆమెను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో కూడా వెల్లడి కావాల్సి ఉంది.

 

ఇక శిరీష కేసు పరిణామాలు వెల్లడైతే కానీ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసు చిక్కుముళ్లు విప్పడం ఈజీ అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల తర్వాత కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

loader