ఓ హత్య కేసులో నేరస్థులను దిష్టిబొమ్మ పట్టించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం. గత నెల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఓ మహిళ అనుమానాస్పద  స్థితిలో మృతి చెందింది. కాగా.. ఈ కేసు మిష్టరీని పోలీసులు ఓ దిష్టిబొమ్మ సహాయంతో  చేధించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ హౌసింగ్ బోర్డు కాలనీ రేకుల షెడ్ లో ఇటీవల ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. సదరు మహిళ ఫోటోని కరపత్రాలుగా చేసి.. వివిధ ప్రాంతాల్లో పంచిపెట్టారు.

ఫొటోలో మృతదేహం పక్కనేపడి ఉన్న దిష్టిబొమ్మ వారు గమనించారు. తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్‌గా దిష్టిబొమ్మలు విక్రయించే గుంటూరు, విజయవాడ, వరంగల్‌, మహబూబాబాద్‌, తిరువూరు ప్రాంతాల్లో తిరిగి ఆ ఫొటోను చూపించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా క్రోసూర్‌ మండలం నుంచి చుంచుపల్లి పోలీసులకు ఓ ఫోన్‌ కాల్‌ ద్వారా కొంత సమాచారం వచ్చింది. ఫొటోలో ఉన్నది తమ బిడ్డే అనేది ఫోన్‌కాల్‌ సారాంశం. పోలీసులు వారిని కొత్తగూడెం పిలిపించారు. వారితో మాట్లాడితే అసలు విషయం వెలుగుచూసింది. 

మృతురాలి పేరు కళ్యాణి(30) అని ఆమె..వివాహమై భర్తతో విడిపోయింది. ఒక కుమార్తె ఉంది. ఆమె మేనబావ.. దిష్టిబొమ్మల తయారీ వ్యాపారం చేసుకొని జీవిస్తుండగా.. వారి వద్దనే ఉండి కళ్యాణి కూడా అదే వ్యాపారం చేసుకుంటోంది. కాగా.. ఈ క్రమంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో.. కళ్యాణిని చావగొట్టి చంపేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడ పడేశారు. 

దిష్టిబొమ్మ ఆధారంగా కేసు చేధించడం చాలా అరుదైన విషయమని డీఎస్పీ అలీ హర్షం వ్యక్తం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.