పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు అనే సామేత ఎప్పుడైనా విన్నారా..? రెండు పిట్టలు ఆహారం కోసం కొట్టుకుంటూ ఉండగా... పిల్లి వచ్చి న్యాయం చేస్తానని.. మొత్తం ఆహారం అదే తినేస్తుంది. కొంచెం అటూ ఇటుగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ముగ్గురు మహిళలు బంగారు నక్లెస్ గొడవ తీర్చమని పోలీసులకు వద్దకు వెళితే.. వాళ్లు దానిని వారి దగ్గర నుంచి తీసేసుకున్నారు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. ముగ్గురు మహిళలు రోడ్డుపై వెళుతుండగా వారికి ఓ బంగారు నక్లెస్ దొరికింది. దాన్ని సమానంగా పంచుకునే విషయంలో తగాదాలు వచ్చాయి. ఆ విషయం కాస్తా పోలీసుల చెవిన పడింది. వారు నెక్లె‌స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హుస్సేనీఆలం పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 

ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కొత్వాల్‌, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 20న సాయంత్రం 3 గంటల సమయంలో పురానాపూల్‌ పార్దివాడ కమాన్‌ వద్ద పార్దివాడ బస్తీకి చెందిన ముగ్గురు మహిళలకు సుమారు మూడు తులాల బంగారు నెక్లెస్‌ దొరికింది. వారు దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. పంచుకునే విషయంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలిసింది. దీంతో డిటెక్టివ్‌ టీమ్‌ సిబ్బంది పార్దివాడకు వెళ్ళి ఆ మహిళల నుంచి నెక్లె్‌సను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు వచ్చి తగిన ఆధారాలు చూపించి నెక్లెస్‌ను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.