వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా వున్న రంగయ్యను పోలీసులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా వున్న రంగయ్యను పోలీసులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అస్తమాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన కొద్దిరోజుల క్రితం పులివెందులలో చికిత్స తీసుకున్నారు. అప్పటికీ నయం కాకపోవంతో రంగయ్యను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అయితే పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 

రెండేళ్ల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రంగయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో రంగయ్యకు 1+1 భద్రతను కేటాయించారు అధికారులు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున రంగయ్య అదే ఇంటి వద్ద కాపలాగా ఉన్నాడు. హత్య జరిగిన రోజున ఏం జరిగిందనే విషయమై ఆయన దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగయ్యకు భద్రతను కేటాయించారు.

ALso Read: వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉంది.. సీబీఐ

మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఈ నెల 5వ తేదీన సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను ఇప్పటికే తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోగా ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో రేపు కోర్టులో లొంగిపోతానని ఎర్ర గంగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.