హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేటలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్దఅంబర్ పెట్ ఔటర్ రింగురోడ్డు వద్ద హయత్‌నగర్ పోలీసులు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. 

హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేటలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్దఅంబర్ పెట్ ఔటర్ రింగురోడ్డు వద్ద హయత్‌నగర్ పోలీసులు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఒక కారులోనుంచి మరో కారులో గంజాయి మారుస్తుండగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు. పట్టుబడిన గంజాయి.. తూర్పు గోదావరి ఏజెన్సీ ఏరియా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఇక, గంజాయి ముఠా వద్ద నుంచి 470 కేజీల గంజాయి, నాలుగు కార్లు, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. 

ఇక, ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 200 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. భద్రాచలం టౌన్‌లో కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీయ సమాచారంతో శనివారం తెల్లవారుజామున కూనవరం రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అటువైపు వచ్చిన ఓ కారు అతివేగంతో ఆపకుండా వెళ్లింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాన్ని వెంబండించి పట్టుకున్నారు. అయితే వాహనంలోని వారు మాత్రం పారిపోయారు. ఇక, వాహనం జార్ఖండ్ రిజిస్ట్రేషన్‌ పేరుతో ఉందని పోలీసులు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.