Asianet News TeluguAsianet News Telugu

లక్షల సంపాదించే స్కీమ్ అని చెప్పి..కోట్లు కొల్లగొట్టారు

ముందు తెలివిగా కొందరి ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. ఆ తర్వాత వాటికి ఎస్‌ఎంస్ లు పంపించడం, వారి స్కీమ్‌లకు సంబంధించి స్థానిక పత్రికల్లో చిన్న క్లాసిఫైడ్‌ ప్రకటనలు ఇస్తారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు పొందండి, లక్షల రూపాయలు సంపాదించండి అంటూ పబ్లిసిటీ ఇస్తారు. ప్రముఖ హోటళ్లలో సెమినార్‌లు ఏర్పాటు చేస్తారు. 

police revealed multilevel health scheme scam
Author
Hyderabad, First Published Sep 15, 2018, 3:15 PM IST

మా స్కీమ్ లో మీరు డబ్బులు కడితే..  ఎలాంటి శ్రమ లేకుండా మీరు లక్షలు సంపాదించవచ్చని నమ్మిస్తారు. తీరా కట్టాక.. కనిపించకుండా మాయమైపోతారు. ఇది ఇద్దరు వ్యక్తుల స్కామ్. వారిద్దరూ చదివింది ఏడో తరగతే కానీ.. ఆ తెలివితోనే అందరినీ ముంచి కోట్లు సంపాదించారు. అదే  హెర్బల్‌ హెల్త్‌ ప్రాడక్ట్‌ స్కామ్‌. 

ఈ స్కామ్‌లో ఇద్దరు ప్రధాన సూత్రధారులు రాధేశ్యామ్‌, సురేందర్‌సింగ్‌.  బుద్ధి బలాన్ని ప్రదర్శించి మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కీమ్‌ పేరుతో అతిపెద్ద స్కామ్‌కు తెరతీశారు. దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మందిని ఈ ఊబిలోకి దింపారు. వారి నుంచి రూ. 1200 కోట్లు దండుకున్నారు. చివరకు సైబరాబాద్‌ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. 

వీళ్లు ప్లాన్ ప్రకారమే దీనిని నడిపిస్తారు. ముందు తెలివిగా కొందరి ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. ఆ తర్వాత వాటికి ఎస్‌ఎంస్ లు పంపించడం, వారి స్కీమ్‌లకు సంబంధించి స్థానిక పత్రికల్లో చిన్న క్లాసిఫైడ్‌ ప్రకటనలు ఇస్తారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు పొందండి, లక్షల రూపాయలు సంపాదించండి అంటూ పబ్లిసిటీ ఇస్తారు. ప్రముఖ హోటళ్లలో సెమినార్‌లు ఏర్పాటు చేస్తారు. 

సమావేశానికి హాజరైన ప్రజలు వారి హంగూ.. ఆర్భాటం చూసి ఆశ్చర్యపోయేలా అక్కడి వాతావరణం ఉంటుంది. ఖర్చుపెట్టకుండా ఇంట్లోనే కూర్చొని అతి తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించడం ఎలా అనే దానిపై సెమినార్‌లో ఉపన్యాసాలు దంచికొడతారు. నెలకు రూ. లక్షకు పైగా సంపాదిస్తున్న వారి గురించి అక్కడ ఏర్పాటు చేసిన తెరపై చూపిస్తారు. వారిని ప్రత్యక్షంగా మీరే చూడండి అంటూ కొంతమందిని వేదికపైకి పిలుస్తారు.

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ముందునుంచి హెల్త్‌ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ చేస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చి వెనుకనుంచి భారీ మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల వెలుగులోకి కరక్కాయ స్కామ్‌, హరియాణా గ్యాంగ్‌ చేసిన రూ. 1200 కోట్ల స్కామ్‌లో నిందితులు చేసింది కూడా అదే. హెల్త్‌ప్రొడక్ట్‌ల పేరుతో కస్టమర్లను బురిడీ కొట్టించారు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. రూ. 7,500 కట్టి పేరు రిజిస్ట్రర్‌ చేసుకోవాలన్నారు.

అందులో రూ. 2,500లు రిజిస్ట్రేషన్‌ చార్జీకింద మినహాయించి, మిగిలిన రూ. 5000కు వివిధ రకాల నకిలీ హెల్త్‌ ప్రొడక్ట్స్‌ అందించారు. ఈ స్కీమ్‌లో చేరిన ఒక్కొక్కరు మరో ఇద్దరిని చేర్పిస్తే ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున కమీషన్‌ ఇస్తామన్నారు. రూ. 7,500లు కట్టి జాయిన్‌ అయిన వ్యక్తికి నెలకు రూ. 2500 చొప్పున 24 నెలలపాటు ఉచితంగా డబ్బులు చెల్లిస్తామన్నారు. రెండేళ్లలో రూ. 60 వేలు ఆదాయం వస్తుందని నమ్మించారు. మూడేళ్లుగా దేశవ్యాప్తంగా లక్షల మందిని ఈ స్కీమ్‌లో చేర్పించారు. సుమారు రూ. 1200 కోట్లు కొల్లగొట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios