Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. వారికి మళ్లీ ఈవెంట్స్.. బోర్డ్ కీలక నిర్ణయం 

తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు శుభవార్త. ఒక్క సెంటిమీటర్ ఎత్తుతో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

police Recruitment board conducting re-physical events for disqualified candidates in height
Author
First Published Feb 9, 2023, 2:27 AM IST

తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఒక్క సెంటిమీటర్ ఎత్తుతో ఫిజికల్ టెస్టులకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని, అలాంటి అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. 

తెలంగాణ ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే.. ప్రిలిమినరీ, ఫిజిక‌ల్ ఈవెంట్స్ పూర్తయ్యాయి.ఇక మెయిన్స్ ప‌రీక్ష‌లు మాత్ర‌మే మిగిలాయి. ఈ క్రమంలో ఎత్తు విష‌యంలో డిస్ క్వాలిఫై అయి.. ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొనని అభ్య‌ర్థులు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో 1 సెంటిమీట‌ర్, అంత కంటే త‌క్కువ ఎత్తులో.. ఈవెంట్స్ కు అర్హత కోల్పోయిన అభ్య‌ర్థుల‌కు మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టు ఆదేశించింది.   

హైకోర్టు ఆదేశాల మేర‌కు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)తాజాగా ఈ నిర్ణ‌యాన్ని వెల్లడించింది. ఒక సెంటిమీట‌ర్ లేదా అంత కంటే త‌క్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు మ‌రోసారి ఫిజిక‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ మేరకు అభ్యర్థులు మరోసారి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 10 ఉద‌యం 8 గంట‌ల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌రకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం క‌ల్పించారు. వీరికి అంబ‌ర్‌పేట పోలీసు గ్రౌండ్స్‌, కొండాపూర్ 8వ బెటాలియ‌న్‌లో ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్నారు. 
 
ఇప్పటి వరకూ.. 16,969 కానిస్టేబుల్‌ పోస్టుల తుది రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీలో ఉన్నారు. అలాగే 587 ఎస్‌ఐ పోస్టుల కోసం 59,574 మంది అర్హత సాధించారు. అయితే.. తాజా నిర్ణయంతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios