నల్లగొండ జిల్లాలోనే కాక యావత్ తెలంగాణ అంతటా సంచలనం రేపిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య  కేసులో మరో కదలిక చోటు చేసుకుంది. నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ ను కొందరు దుండగులు కిరాతకంగా అర్ధరాత్రి హతమార్చారు. ఈ ఘటనలో నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారన్న విమర్శలున్నాయి. అధికార పార్టీ నేతలపైనా ఆరోపనలు గుప్పుమన్నాయి. ఏకంగా అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ బలంగా ఆరోపణలు గుప్పించింది.

అయితే ఈ కేసులో ఎ 6 నుంచి ఎ 11 నిందితులకు మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ నల్లగొండ పోలీసులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద జిల్లా కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వాదోపవాదాల అనతరం విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. దీనిపై రేపు తీర్పు వెలువడే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ బెయిల్ రద్దు విషయం నల్లగొండ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఒకవైపు నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న బలమైన ఆరోపణలు వస్తున్న తరుణంలో బెయిల్ రద్దు కోసం పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ముందుగా వారందరికీ బెయిల్ వచ్చేలా కేసులు నమోదు చేసి.. తీరా విమర్శలు రావడంతో బెయిల్ రద్దు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పట్ల తీవ్రమైన చర్చ సాగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు న్యాయస్థానంలో చివాట్లు తిన్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ బెయిల్ రద్దు కాకపోతే ఈ కేసును తిరిగి హైకోర్టులో పోలీసులు సవాల్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే మాత్రం పోలీసులకు కొద్దిగా ఉపశమనం దొరికే అవకాశాలున్నాయి. ఈ కేసు విచారణాధికారిగా ఉన్న నల్లగొండ టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు గతంలో అన్ని వైపులా వత్తిళ్లు తట్టుకోలేక చెప్పా పెట్టకుండా గుంటూరు వెళ్లి తలదాచుకున్నారు. నల్లగొండ పోలీసులు అక్కడికి వెళ్లి ఆయనను తీసుకొచ్చారు. తర్వాత తన మీద వత్తిళ్లేం లేవని సిఐ మీడియా ముందు చెప్పారు.

తాజాగా బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు గుట్కు మిట్కు మంటూ కాలమెల్లదీస్తున్నారు. రేపటి తీర్పు తర్వాత ఈ కేసులో పోలీసులు ఏం చేస్తారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.