హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు రౌడీషీట్ ఓపెన్ చేశారు. తనపై రౌడీషీట్‌ ఓపెన్ చేసిన పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

హైద్రాబాద్‌‌లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా బీజేపీ అభ్యర్ధిగా రాజాసింగ్  విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో  ఉన్న ఏకైక ఎమ్మెల్యే  రాజాసింగ్.

బుధవారంనాడు మంగళ్ హాట్ పోలీస్‌స్టేషన్‌లో  రౌడీషీటర్ల లిస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన  పేరును మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన విషయాన్ని తన దృస్టికి బీజేపీ కార్యకర్త ఒకరు తీసుకొచ్చారని చెప్పారు.

తెలంగాణ పోలీసుల దృష్టిలో తాను ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనేది తనకు తెలియడం లేదన్నారు. తన పేరు రౌడీషీట్ లిస్టులో ఉండడంపై తాను కొద్దిసేపు బాధపడినట్టుగా చెప్పారు.  కొందరు మంత్రులపై కూడ కేసులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ కు చెందిన వారిపై కూడ రౌడీషీట్లు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ కు చెందన వారిపై మంత్రులపై రౌడీషీట్లు ఓపెన్ చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. 

తనపై రౌడీషీట్‌ ఓపెన్ చేయడంపై ముఖ్యమంత్రి, హోంమంత్రి  సమాధానం చెప్పాలని ఆయన డమాండ్ చేశారు. ప్రజలకు తెలుసు తాను ఎలా పని చేస్తానని ఆయన గుర్తు చేశారు.