రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం వేళ బద్దలవుతున్న ప్రగతి భవన్ గేట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ ముుందున్న గేట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ముుళ్లకంచె, బారీకేడ్లను తొలగించిన అధికారులు గ్రిల్స్, గేట్ల తొలగింపు చేపట్టారు.
హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ ముందు ఏర్పాటుచేయించిన రక్షణ వలయాన్ని అధికారులు తొలగించారు. ఇప్పటికే ముళ్లకంచెలు, బారీకేడ్లను తొలగించిన జిహెచ్ఎంసి సిబ్బంది శాశ్వతంగా ఏర్పాటుచేసిన గ్రిల్స్ కూడా తొలగిస్తున్నారు. గేట్లను తొలగించడంతో లోపలినుండి వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. జేసిబిలు, ట్రాక్టర్లతో ఈ ప్రగతిభవన్ ముందున్న గ్రిల్స్ తొలగిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర సచివాలయం, ప్రగతి భవన్ లోకి సామాన్యులు అనుమతి వుంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని... ఎప్పుడయినా ప్రజల తమ సమస్యలు తెలియజేసేందుకు ఇక్కడికి రావచ్చని అన్నారు. ఇందుకోసం ప్రగతి భవన్ ముందున్న గేట్లను తొలగిస్తామని రేవంత్ రెడ్డి ముందుగానే ప్రకటించారు.
ఎన్నికల సమయంలో చెప్పినట్లే ముందుగా ప్రగతిభవన్ పై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ఓవైపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు ప్రగతి భవన్ ముందున్న గేట్ల తొలగింపు కూడా జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రగతి భవన్ గేట్లను బద్దలుగొడుతున్నారు. పూర్తిగా గ్రిల్స్ తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.