కామారెడ్డిలో తల్లి, కొడుకు ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదైంది. ఆత్మహత్యకు ముందు వారు తీసుకన్న సెల్పీ వీడియో, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

కామారెడ్డిలో తల్లి, కొడుకు ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదైంది. ఆత్మహత్యకు ముందు వారు తీసుకన్న సెల్పీ వీడియో, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో రామాయం పేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, రామాయం పేట మాజీ సీఐ నాగార్జున గౌడ్, తోట కిరణ్, కృష్ణగౌడ్, స్వరాజ్, పృథ్వీరాజ్‌లు ఉన్నారు. వీరిపై పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు సంతోష్ సెల్పీ వీడియోపై మెదక్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సెల్పీ వీడియోలో సంతోష్ చెప్పిన వారి వివరాలు సేకరిస్తున్నారు. 

వివరాలు.. మెదక్ జిల్లా రామాయం పేటకు చెందిన పద్మ, ఆమె కుమారుడు సంతోష్ ఈ నెల 11న కామారెడ్డిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. తల్లి పద్మ వైద్యం కోసం వీరు కామారెడ్డి వచ్చినట్టుగా సమాచారం. అయితే వారు ఉంటున్న రూమ్‌లోనే నిప్పంటించుకున్నారు. వారి గది నుంచి తెల్లవారుజామన పొగలు రావడం గమనించి లాడ్జి సిబ్బంది.. పోలీసులుకు సమాచారమిచ్చారు. 

డోర్ ఓపెన్ చేసి చూడగా ఇద్దరు కాలిన గాయాలతో కనిపించారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరించారు. అయితే అప్పటికే వారిద్దరు చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు వారు పద్మ, సంతోష్‌లు ఓ సెల్పీ వీడియో తీసుకున్నారు. అయితే అందులో ఏం చెప్పారనేది తెలియాల్సి ఉంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ సోమనాథం.. అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కామారెడ్డిలోనే అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులకు సూచించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

తల్లి, కొడుకు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టినట్టుగా డీఎస్పీ వెల్లడించారు. మరోవైపు పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, తాము ఆత్మహత్య చేసుకోవడానిక ఏడుగురు కారణమని మృతులు సూసైడ్‌ నోటులో పేర్కొన్నారు. తాము చనిపోవడానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని ఆరోపించారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేశారని సంతోష్ వీడియోలో చెప్పారు.

‘శ్రీను అనే వ్యక్తితో కలిసి నేను వ్యాపారం చేశాను. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో.. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నాడు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు’ అని సంతోష్ వీడియోలో పేర్కొన్నాడు. 

మున్సిపల్ చైర్మన్‌తో కలిసి అప్పటి రామాయం పేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గారని.. ఏడాది పాటు తనను వేధించారని చెప్పాడు. తన వ్యాపారం జరగకుండా చేశారని సంతోష్ సెల్పీ వీడియోలో తెలిపాడు. దీంతో తాను అర్థికంగా నష్టపోయానని.. అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నాడు. వీడియోలో తల్లి, కొడుకులు కన్నీరు పెట్టుకుంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ వీడియో కన్నీరు పెట్టించేలా ఉంది. ఇక, గతంలో 20 పేజీలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని సంతోష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.