టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో 144 సెక్షన్ విధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడుల నేపథ్యంలో భూపాలపల్లి పట్టణంలో ఉద్రిక్తలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. రేపటి నుంచి ఆంక్షలు అమల్లో వుంటాయని, రాజకీయ పార్టీల చర్చలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిన్న రేవంత్‌పై దాడి ఘటనకు సంబంధించి కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంగళవారం భూపాలపల్లిలో కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ఖండించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడులు చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం శోచనీయమని.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ALso REad: రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడి.. పోలీసుల సమక్షంలోనే ఘటన , భట్టి ఆగ్రహం
ఇకపోతే.. తనపై కోడిగుడ్లు, టమోటాలు విసరడంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలచుకుంటే నీ ఇల్లు కూడా వుండదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనపై కోడిగుడ్లు వేయించడం కాదని, దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 100 మంది తాగుబోతులను తనపైకి పంపుతావా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు మంగళవారం ఉదయం భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి విద్యార్ధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విద్యా సంస్థల్లో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అమలయ్యేలా పాలసీని రూపొందించనున్నట్టుగా ఆయన తెలిపారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ను తీసుకువచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఈ చట్టం ద్వారా పేదలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని చట్టం చెబుతుందన్నారు. తమ ప్రభుత్వం ఈ చట్టం అమలయ్యేలా పాలసీని రూపొందించనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
