టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంగళవారం భూపాలపల్లిలో కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంగళవారం భూపాలపల్లిలో కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ఖండించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడులు చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం శోచనీయమని.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

ఇకపోతే.. తనపై కోడిగుడ్లు, టమోటాలు విసరడంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలచుకుంటే నీ ఇల్లు కూడా వుండదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనపై కోడిగుడ్లు వేయించడం కాదని, దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 100 మంది తాగుబోతులను తనపైకి పంపుతావా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతకుముందు మంగళవారం ఉదయం భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి విద్యార్ధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విద్యా సంస్థల్లో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ అమలయ్యేలా పాలసీని రూపొందించనున్నట్టుగా ఆయన తెలిపారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ను తీసుకువచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఈ చట్టం ద్వారా పేదలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని చట్టం చెబుతుందన్నారు. తమ ప్రభుత్వం ఈ చట్టం అమలయ్యేలా పాలసీని రూపొందించనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చు పెట్టుబడి అని .. విద్యకు 10 శాతం నిధులను ఖర్చు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. హస్టళ్లలో కూడా సౌకర్యాలను కూడా మెరుగుపర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించనుందని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై బిశ్వాల్ కమిటీని కేసీఆర్ ప్రభుత్వం నియమించిందన్నారు. 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమిటీ చెప్పిందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగులుంటే ఇందులో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచి కొత్త ఉద్యోగాల ప్రకటన రాకుండా కేసీఆర్ సర్కార్ చేసిందని రేవంత్ విమర్శించారు.