భూపాలపల్లిలో 144 సెక్షన్: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత గండ్ర హౌస్ అరెస్ట్
భూపాలపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రత సవాళ్ల నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
వరంగల్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత గంండ్ర సత్యనారాయణల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో భూపాలపల్లిలో 144 సెక్షన్ విధించారు.
భూపాలపల్లిలో గండ్ర గండ్ర వెంకటరమణారెడ్డి పై కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఆధారాలతో రుజువు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. గురువారంనాడు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజల ముందు ఆధారాలను బయట పెట్టాలని గండ్ర సత్యనారాయణరావుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ కు కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు స్పందించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై తాము చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు సిద్దంగా ఉన్నామని గండ్ర సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య భూపాలపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
హన్మకొండలోని తన నివాసంలోనే కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావును పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. మరో వైపు ఇవాళ ఉదయం అంబేద్కర్ చౌరస్తా వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుండి ఎమ్మెల్యే బయటకు వెళ్లకుండా పోలీసులు గేటుకు తాళం వేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్దకు వెళ్లకుండా గండ్ర వెంకటరమణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు నేతలు తమ వాదనలను సమర్ధించుకుంటున్నారు.
రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో కోడిగుడ్లతో దాడి జరిగింది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులే ఈ దాడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను తలుచుకుంటే ఎమ్మెల్యే ఇల్లు, థియేటర్ కూడా ఉండదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి, ఈ క్రమంలోనే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర సత్యనారాయణరావుల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి.