ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని నిరసన తెలుపుతున్న ఎమ్మార్పీఎస్.. హైదరాబాద్-విజయవాడ హైవే దిగ్భంధానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ హైవే దిగ్భంధానికి యత్నించిన ఎమ్మార్పీఎస్ శ్రేణులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మందకృష్ణ మాదిగను పోలీసులు హైదరాబాద్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. మందకృష్ణ మాదిగ నిరసనకు వెళ్లకుండా నిరోధించడానికి నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలోని తన నివాసం నుంచి బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.

అయితే అరెస్టైన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను విడుదల చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలను కోరిన మందకృష్ణ మాదిగ కోరారు. మాదిగల ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. ఇక, ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఎంఆర్‌పీఎస్‌ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. అలాగే కేంద్రంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒత్తిడి తేవాలని కోరుతోంది.

ఇదిలా ఉంటే.. విజయవాడలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌పై ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరసన సోమవారం హింసాత్మకంగా మారింది. జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ, పదుల సంఖ్యలో ఆందోళనకారులు తోటచర్ల వద్ద హైవేను దిగ్బంధించారు. ఆందోళనకారులను తొలగించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే జరిగిన రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. కానిస్టేబుల్‌ తలకు గాయం కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.