హైదరాబాద్: సీఎం ఓఎస్డీ పీఏగా చెప్పుకొంటూ మోసాలకు పాల్పడ్డ నిందితుడు సుధాకర్ కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను దర్యాప్తులో గుర్తించారు.

భక్తి, అతిథ్యం ఆధారంగా ప్రజలను నమ్మించి  మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.సుధాకర్ మాయాజాలంలో ఇద్దరు స్వామీజీలు కూడ చిక్కుకొన్నారు. స్వామీజీలు కూడ సుధాకర్ కు రూ. 60 లక్షలు ఇచ్చారని పోలీసులు గుర్తించారు.

కూకట్‌పల్లి-మియాపూర్ మార్గంలో ఉన్న ఓ ఆశ్రమానికి సుధాకర్ ఏడాది నుండి తరచూ వెళ్లేవాడు.  ఫార్చూనర్ కారు, గన్‌మెన్లను చూసి స్వామీజీ అనుచరులు అతనికి మర్యాదలు చేసేవాడు.ఇదే ఆశ్రమంలో  50 మంది భక్తులకు స్వామీజీకి మహంకాళి అమ్మవారి పంచలోహ ప్రతిమలను బహుమతిగా ఇచ్చాడు.ఈ ఆశ్రమానికి వచ్చే  ఓ బ్యాంకు మేనేజర్ భార్యతో సుధాకర్ కు పరిచయమైంది. ఆమెను అమ్మా అని పిలిచేవాడు. తాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.

మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే  చెబితే వారికి మియాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని నమ్మించాడు. ఒక్కొక్కరి వద్ద నుండి రూ. 5 లక్షలు ఇప్పించాలని కోరాడు. అంతేకాదు ప్రత్యేకంగా వీఐపీ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించడంతో ఐదు నెలల క్రితం ఆమె రూ. 1.23 కోట్లు వసూలు చేసి ఇచ్చింది.  సంక్రాంతి లోపు ఇళ్లు ఇప్పిస్తానని చెప్పిన సుధాకర్  ఆ తర్వాత ఈ ఇళ్ల విషయం గురించి పట్టించుకోలేదు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొద్ది దూరంలో ఓ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ భూమిలో 600 చదరపు గజాల స్థలం ఇప్పిస్తానని  సుధాకర్ ఓ ప్రోఫెసర్ ను కూడ నమ్మించాడు.ఈ స్థలం హక్కులు ప్రభుత్వానివేనని ఎవరికైనా కేటాయించే అధికారం సీఎం కార్యాలయానికి ఉందని నకీలీ ఉత్తర్వులు ప్రొఫెసర్ కు చూపాడు.

రూ. 33 లక్షలు తీసుకొని ప్రొఫెసర్ పేరున నకిలీ ఉత్వర్వులను  ఇచ్చాడు.ఈ ఉత్తర్వుల ఆధారంగా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తే అధికారులు అడ్డుకొన్నారు. దీంతో ప్రొఫెసర్ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.