మావోయిస్టులు కొత్త తరహాలో దాడులకు వ్యుహారచన చేసినట్టుగా తెలుస్తోంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు బీర్ బాటిల్స్‌కు ఐఈడీ అమర్చి పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా పోలీసులు గుర్తించారు.
మావోయిస్టులు కొత్త తరహాలో దాడులకు వ్యుహారచన చేసినట్టుగా తెలుస్తోంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు బీర్ బాటిల్స్‌కు ఐఈడీ అమర్చి పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా పోలీసులు గుర్తించారు. ములుగు జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలు.. వెంకటాపురం పామునూర్ అడవిలో బీర్ బాటిల్స్‌లో ఐఈడీతో మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తరహాలో మావోయిస్టులు దాడులు సిద్దం కావడం భద్రతా బలగాలను సైతం విస్మయానికి గురిచేసింది.
మందుపాతరను గుర్తించిన భద్రతా బలగాలు.. దానిని నిర్వీర్యం చేశాయి. కరెంట్ వైర్, బీర్ బాటిల్స్, బోల్ట్‌లు, కాపర్ సీల్, గన్ పౌడర్ సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ తనిఖీలు చేపట్టింది. అడవిలోకి కూంబింగ్‌కు వెళ్లే భద్రతా బలగాలే టార్గెట్‌గా ఈ కొత్త రకం దాడులకు మావోయిస్టులు సిద్దమైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు పోలీసు సిబ్బందిని మావోయిస్టులు హతమార్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత బస్తర్‌లోని బీజాపూర్‌లో దంతెవాడలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మణిరామ్ వెట్టి అనే హెడ్ కానిస్టేబుల్‌ను అనుమానిత మావోయిస్టులు నరికి చంపారు. మణిరామ్ వెట్టి సెలవులో ఉన్నాడని.. బెల్చర్ గ్రామంలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్‌కె బర్మన్ తెలిపారు. ఇది మావోయిస్టుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారని బర్మన్ చెప్పారు.
ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత.. మరో ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రాజేష్ సింగ్ రాజ్‌పుత్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ కానిస్టేబుల్ లలిత్ కుమార్ సామ్రాత్ ఉదయం 7.30 గంటలకు మోటారుసైకిల్‌పై మహారాష్ట్ర సరిహద్దు వైపు వెళ్తున్నప్పుడు మావోయిస్టులు మెరుపుదాడి చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు చేతిలో ఆయుధాలు లేవని.. సాయుధులైన నక్సలైట్ల బృందం వారిపై కాల్పులు జరిపిందని పోలీసులు ఆరోపించారు. సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకునే ముందు నక్సలైట్లు పోలీసుల మోటార్‌సైకిల్‌ను తగులబెట్టారని చెప్పారు.
