హైదరాబాద్ నగరంలో దిశ దారుణ హత్య మరవకముందే శంషాబాద్ లో మరో మహిళ చనిపోయి కనిపించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ మహిళ, ఎవరు, ఏమిటి అన్న విషయాలు అయితే... తెలిసాయి కానీ... ఆమె హత్యకు సంబంధించన విషయం మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆదివారం ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నెల 29 మధ్యాహ్నం 1 గంటల సమయంలో మంగళ్‌హాట్‌ డివిజన్‌ బంగ్లాదేశ్‌ గల్లీలోని ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు.

పురానాఫూల్‌ వైపు నడుచుకుంటూ వెళ్లిన ఫుటేజ్‌లను సేకరించి ఆమెను ఎవరైన ఫాలో అయ్యారా, ఇంటి నుంచి ఒకరే వెళ్లిందా? ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాలను పరిశీలించారు. సదరు మహిళ ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఆమె చేతిలో ఎలాంటి వస్తువులు లేకపోవడం, కనీస ఖర్చులకు కూడా డబ్బులు తీసుకెళ్లలేదని తెలుస్తోంది. 

కానీ, మంటల్లో కాలిపోయే ముందు.. సిద్దులగుట్ట వైపు వెళ్తున్న సమయంలో ఆమె భుజాన సంచి ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ సంచి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా పరిశీలిస్తున్నారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, తరచూ ఆమె ఇలా ఇంటి నుంచి వెళ్లినా, 24 గంటల్లోనే తిరిగి వచ్చేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.