ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసే యువతి పట్ల సినీ నటి రాధా ప్రశాంతి దురుసుగా ప్రవర్తించారు. దీంతో.. ఆమె ఫిర్యాదు మేరకు సినీ నటి రాధా ప్రశాంతి, ఆమె మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిలింనగర్‌ రోడ్డు నంబరు 9లో నివసించే ఎం. త్రిష్ణసాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఈ నెల 20వ తేదీన ఆమె తన ఇంట్లో టీవీ చూస్తోంది. ఇంటి బయట అలికిడి వినిపించడంతో బయటకు వచ్చింది. అదే సమయంలో తన పక్కింట్లో పనిచేసే వాచ్‌మన్‌ లక్ష్మిని ఓ వ్యక్తి కొడుతున్నాడు. అక్కడే సినీ నటి రాధా ప్రశాంతి కూడా ఉన్నారు. 

ఆమె ఆదేశాల మేరకు లక్ష్మిని కొడుతున్నట్టు గమనించిన త్రిష్ణ తన సెల్‌ ఫోన్‌లో వీడియో తీస్తుండగా కారులో నుంచి మరో వ్యక్తి దిగి ఆమె పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించి దుర్భాషలాడాడు. రాధాప్రశాంతి ప్రోద్భలంతో ఇదంతా జరిగిందని, వారిపై చట్ల పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాధా ప్రశాంతి, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.