Asianet News TeluguAsianet News Telugu

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు చార్జ్‌షీట్.. 10 మందిపై అభియోగాలు..

బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్ మేనేజర్ పాటు మొత్తం 10 మందిపై పోలీసులు చార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపారు.

police file chargesheet on Pudding Mink pub drugs case
Author
First Published Dec 21, 2022, 1:29 PM IST

బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్ మేనేజర్ పాటు మొత్తం 10 మందిపై పోలీసులు చార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపారు. ఏప్రిల్‌ 2వ తేదీన అర్ధరాత్రి పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ పబ్‌పై దాడి చేసిన పోలీసులు.. పబ్‌లో ఉన్నవారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. వారి నుంచి వివరాలను సేకరించి తర్వాత పంపించి వేశారు. 

అయితే ఈ దాడుల్లో పబ్‌లో 5 గ్రాముల తెల్లటి పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పబ్‌లో నుంచి రెండు సెల్‌ఫోన్లు, 216 సిగరెట్ పీకలను స్వాధీనం చేసుకన్న పోలీసులు.. పరీక్షల  కోసం టిష్యూ పేపర్స్‌ను సీజ్ చేశారు. ఏప్రిల్ 23 న పబ్ నుండి స్వాధీనం చేసుకున్న తెల్లటి పొడి కొకైన్ అని ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌లో నిర్దారణ అయింది.

అయితే ఈ ఘటన జరిగిన ఎనిమిది నెలల తర్వాత పోలీసులు తాజాగా చార్జ్‌‌షీట్ దాఖలు చేశారు. పబ్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌, భాగస్వాములు పుప్పాల అభిషేక్‌, వీరమాచినేని అర్జున్‌, పెన్మత్స కిరణ్‌రాజులతో పాటు ఆరుగురు కస్టమర్లపై పోలీసులు అభియోగాలు మోపారు. 32మందిని సాక్షులుగా చేర్చడంతో పాటు డ్రగ్స్‌కు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదికలు, ఇతర ఆధారాలను చార్జ్‌షీట్‌తో జతపర్చారు.  నాంపల్లిలోని సెషన్స్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో 200పైగా పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 

‘‘ఈ కేసులోని వాస్తవాలు, సాక్ష్యాలను బట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వినియోగదారులకు పబ్ నిర్వాహకులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించబడింది.
ఇలా చేయడం ద్వారా అనిల్, అభిషేక్, అర్జున్ మరియు కిరణ్ ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (సి) కింద నిబంధనలను ఉల్లంఘించారు. ఇది ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 22 (బీ), 25, 29 (1) కింద శిక్షార్హమైంది. నిందితులుగా ఉన్న ఆరుగురు వినియోగదారులు ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డాడు” అని పోలీసులు ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios