ముఖం మీద యాసిడ్ పోస్తానని బెదిరించి.. ఓ యువతిని యువకుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సైదాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి (21) బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఓ ప్రైవేటు కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా  పనిచేస్తోంది. 

కాగా.. అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే యువకుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వీరిద్దిరికీ మూడేళ్ల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే.. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో.. తమ కుమార్తె జోలికి రావద్దంటూ నిఖిల్ బెదిరించారు. 

ఇంట్లో వాళ్లు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో.. యువతి కూడా నిఖిల్ తో మాట్లాడటం పూర్తిగా మానేసింది. దీంతో.. నిఖిల్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఆమె ఆఫీసుకి వెళ్లే సమయంలో కాపుకాచాడు. తనతో మాట్లాడాలని లేకపోతే.. యాసిడ్ ముఖం మీద పోస్తానని బెదిరించాడు.  తనతో తెచ్చుకున్న యాసిడ్‌ సీసా చూపి బెదిరించి తన వాహనం ఎక్కించుకున్నాడు. 

ఎల్బీనగర్‌ వైపు వాహనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి కేకలు వేసింది. వెంటనే స్థానికులు వారి వద్దకు వస్తుండగా నిఖిల్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయంపై యువతి గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిఖిల్‌పై కిడ్నాప్‌, బెదిరింపుల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.