మూడో రోజు పుట్ట మధు విచారణ: భార్య శైలజను కూడా విచారిస్తున్న పోలీసులు
టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు మూడో రోజు విచారిస్తున్నారు. ఆయన భార్య పుట్ట శైలజను కూాడా విచారిస్తున్నారు. పుట్ట మధు లావాదేవీలను తెలుసుకోవడానికి పోలీసులు బ్యాంకులకు లేఖలు రాశారు.
పెద్దపల్లి: న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు సోమవారం మూడో రోజు విచారిస్తున్నారు. విచారణలో పుట్ట మధు నోరు విప్పడం లేదని సమాచారం. అదే సమయంలో పుట్ట మధు భార్య, మంథని చైర్ పర్సన్ పుట్ట శైలజను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పుట్ట మధును మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
పుట్ట మధు బంధువులకు సంబంధించిన ఖాతాల నుంచి ఐదు లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు బ్యాంకులకు లేఖలు రాశారు. మొత్తం 12 ఖాతాల నుంచి 2 కోట్ల రూపాయలు డ్రా చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి పోలీసులు ఆ లేఖలు రాశారు. తన కుమారుడి హత్య కేసును కప్పిపుచ్చడానికి పుట్ట మధు 2 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారని వామన్ రావు తండ్రి కిషన్ రావు ఆరోపించారు.
Also Read: పుట్టమధు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు: 12 బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 2 కోట్ల నగదు బదిలీ
పుట్ట మధు సన్నిహితులను, బంధువులను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ వూదరి సత్యనారాయణకు పోలీసులు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. వామన్ రావు దంపతులపై దాడి తర్వాత ఆస్పత్రికి చేర్చడానికి 45 నిమిషాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
Also Read: షాక్: పుట్ట మధుతో సన్నిహితంగా ఉన్న పోలీసులపై బదిలీ వేటు
సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే కొద్ది రోజులైనా వామన్ రావు బతికి ఉండేవారని అంటున్నారు. వామన్ రావును తీసుకుని వెళ్లిన అంబులెన్స్ లో ఉన్నవారిపై, డ్రైవర్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే మరోసారి కిషన రావును పిలిపించి పోలీసులు మరిన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉంది.