ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రైల్వే ఉద్యోగాలు పేరుతో పలువురు నుంచి రూ. 1.88 కోట్లు వసూలు చేసిన దంపతులను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రైల్వే ఉద్యోగాలు పేరుతో పలువురు నుంచి రూ. 1.88 కోట్లు వసూలు చేసిన దంపతులను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. చెరువు బజార్ పి తులసి, డి సునీతలు.. సుగ్గల వారి తోట ప్రాంతానికి చెందిన దాసరి సరిత తమ కుటుంబ సభ్యులకు రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.36 లక్షలు తీసుకొని మోసం చేసిందని పోలీసు కమిషనర్ Vishnu S Warrierకు ఫిర్యాదు చేశారు.
సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు నిందితులపై వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేవారు. కేసు దర్యాప్తులో భాగంగా సరిత ఆమె భర్త ముగ్దం శ్రీకాంత్ ఉద్యోగాల పేరుతో 12 మందిని మోసం చేసినట్టుగా తేలింది. జన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్.. తల్లాడ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌లో పనిచేస్తున్నాడు. సరిత తాను రైల్వే ఉద్యోగం చేస్తున్నట్టుగా ఫేక్ ఐడీ కార్డు క్రియేట్ చేసి.. బాధితులకు రైల్వేలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసింది. ఆమె భర్త కానిస్టేబుల్ కావడంతో కొందరు బాధితులు ఆమెను నమ్మి డబ్బులు ఇచ్చారు.
ఇలా సేకరించిన డబ్బులు సరిత, ఆమె భర్త శ్రీకాంత్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే కొంతకాలానికి ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, నిందితుల నుంచి చాలా వరకు వసూలు చేసిన మొత్తం రికవరీ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి జూడీషియల్ కస్టడీకి తరలించారు. కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలకు ప్రతిపాదనలు పంపనున్నట్లుగా ఖమ్మం వన్ టౌన్ సీఐ చిట్టి బాబు తెలిపారు.
