హైదరాబాద్: మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చిక్కుల్లో పడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారని ఆరోపిస్తూ నాగబాబుపై తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ పోలీసు స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. 

నాగబాబుపై మానవతా రాయ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. నాగబాబుకు మతిభ్రమించిందని, ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలని ఆయన అన్నారు. 

Also Read: సినీ నటుడు నాగబాబు వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్

మానసిక స్థితి బాగా లేకపోవడం వల్లనే ట్విట్టర్ లో గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సెను దేశభక్తుడని కొనియాడారని ఆయన అన్నారు. నాగబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

నాథూరామ్ గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు వివాదస్వదమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. "ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్" అని నాగబాబు అన్నారు.

Also Read: గాడ్సే వ్యాఖ్యల వివాదంపై వివరణ ఇచ్చిన నాగబాబు