హైదరాబాద్: మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా అభివర్ణిస్తూ సినీనటుడు, జనసేన నాయకుడు నాగబాబు చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షంగా ఆమె తప్పు పట్టారు. 

కులమతాలు వేరైనా దైవం ఒక్కటేనని, ఎన్ని తరాలైనా జాతిపతి ఒక్కడేనని ఆమె ట్వీట్ చేశారు. 130 కోట్ల మంది భారతీయులకు మహాత్ముడు ఒక్కడేనని ఆమె ట్వీట్ చేశారు. 

ఈశ్వర్ అల్లా తేరేనామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్... నాకు కూడా... అని గాడ్సే ఇప్పుడు బ్రతికుంటే.. ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్థించేవాడు, మహాత్మా మన్నించండి అని విజయశాంతి ట్వీట్ చేశారు. 

 

గాడ్సే నిజమైన దేశభక్తుడని, అతని దేశభక్తిని శంకించడానికి వీలు లేదని నాగబాబు ట్వీట్ చేశారు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసి కూడా గాడ్సే అనుకున్నది చేశాడని ఆయన అన్నారు. గాడ్సే వాదనను అప్పట్లో ఏ మీడియా కూడా చెప్పలేదని, అప్పటి ప్రభుత్వానికి లోబడి మీడియా పనిచేసిందని ఆయన అన్నారు. నాథూరామ్ గాడ్సే పుట్టిన రోజు సందర్బంగా నాగబాబు ఆ ట్వీట్ చేశారు.