ప్రేమ, పెళ్లి పేరిట యువతులకు గాలం వేసి... వారి దగ్గర నుంచి అందినంత సొమ్మ కాజేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా మరో మ్యాట్రీమోనీ మోసం హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. విదేశాల్లో బిజినెస్ చేస్తానంటూ నమ్మించి.... నగరానికి చెందని ఓ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర నుంచి సైబర్ నేరస్థుడు దాదాపు రూ.2లక్షలు కాజేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ కి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మంచి సంబంధం కోసం భారత్ మ్యాట్రీమోనీ సైట్ లో తన వివరాలను పొందరుపరిచింది. ఆమె ప్రొఫైల్ ని లోకేష్ జోషి అనే వ్యక్తి ఇంట్రస్ట్ చూపించాడు. తాను స్కాట్ ల్యాండ్ లో బిల్డర్ గా పనిచేస్తున్నానంటూ ఆమెను నమ్మించాడు.

ఒకరి ఫ్రొఫైల్ మరొకరికి నచ్చడంతో... ఫోన్ నెంబర్లు మార్చుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమె అతనిని పూర్తిగా నమ్మిన తర్వాత... అసలు నాటకం మొదలుపెట్టాడు. దుబాయ్‌లోనూ తాను కొన్ని భవనాలు నిర్మిస్తున్నానని చెప్పి, ఆ సైట్‌లో పని చేసే ఓ కార్మికుడు తీవ్రంగా గాయడినట్లు చెప్పాడు. ఈ ఘటనలో అతను డబ్బులు కూడా పోగొట్టుకున్నాడని చెబుతూ భారత్‌లో ఉంటున్న అతడి కుటుంబీకులకు అత్యవసరంగా కొంత మొత్తం పంపాల్సి ఉందని చెప్పాడు.

తన వద్ద డబ్బు ఉన్నప్పటికీ స్కాట్‌ల్యాండ్‌ నుంచి పంపడం ఆలస్యం అవుతుందని చెప్పిన మోసగాడు రూ. 37 వేలు వారికి చేర్చాలని కోరాడు. అతని కోరిక మేరకు ఆమె వెంటనే ఆ డబ్బులు అతను చెప్పిన ఖాతాలో వేసింది.  అప్పటి నుంచి మొదలుపెట్టి ఏదో ఓక కారణంతో డబ్బు గుంజుతూనే ఉన్నాడు.  ఈ నెల 4న తాను దుబాయ్‌ మీదుగా ముంబైకి వస్తున్నట్లు చెప్పిన అతను కేవలం నీ కోసమే ఈ ప్రయాణమంటూ చెబుతూ ఇండియాకు వచ్చాక  నీకు ఓ బహుమతి ఇస్తానంటూ నమ్మబలికాడు. 

అంతటితో ఆగకుండా దుబాయ్‌ నుంచి ముంబైకి బుక్‌ చేసినట్లు సృష్టించిన ఓ విమాన టిక్కెట్టునూ వాట్సాప్‌ చేశాడు. ఆ మర్నాడే ముంబై విమానాశ్రయం నుంచి అంటూ ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.కస్టమ్స్‌ అధికారులుగా చెప్పుకున్న అవతలి వ్యక్తులు జోషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతడి వద్ద భారీ మొత్తం లండన్‌ పౌండ్స్‌ రూపంలో ఉన్నట్లు చెప్పారు. అలా నగదు రూపంలో తీసుకురావడం నేరమని చెప్పారు. 

అతికష్టమ్మీద అతడితో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఆపై అదే ఫోన్‌ కాల్‌లో మాట్లాడిన జోషి తన వద్ద ఉన్న భారీ మొత్తాన్ని నీ కోసం తీసుకువస్తున్నానని, భారత్‌ కరెన్సీలో రూ.కోట్లలో ఉండే ఆ పౌండ్స్‌ను విడిచిపెట్టాలంటే కస్టమ్స్‌ అధికారులు రూ.9.5 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. ఇది నమ్మిన ఆమె అతడు సూచించిన ఖాతాకు రూ.లక్ష  బదిలీ చేసింది. అంతటితో ఆగని అతగాడు మిగిలిన రూ.8.5 లక్షలనూ పంపాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.