రాజాసింగ్ హెచ్చరికలు.. పోలీస్ యూనిఫాంలో మునావర్ షోలోకి బీజేపీ కార్యకర్త , చితకబాదిన పోలీసులు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో మునావర్ ఫారూఖీ కామెడీ షోకి హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శిల్పకళావేదికలోకి పోలీస్ యూనిఫాంలో ప్రవేశించిన బీజేపీ కార్యకర్తను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో మునావర్ ఫారూఖీ కామెడీ షో ప్రారంభమైంది. షోను అడ్డుకోవడానికి వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునావర్ షోను అడ్డుకుంటామని గోషామహాల్ బీజేపీ నేత రాజాసింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ పిలవడం వల్లే మునావర్ హైదరాబాద్‌కు వచ్చారని ఆరోపించారు. రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో మునావర్ షో జరిగే శిల్పకళా వేదిక వద్ద భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. షోకు వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మరోవైపు షోను అడ్డుకోవడానికి వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు . ఈ నేపథ్యంలో ఒక బీజేపీ కార్యకర్త పోలీస్ యూనిఫాంలో షోకు వచ్చాడు. అతనిని గుర్తించిన పోలీసులు లాఠీలతో చితకబాదారు.
ALso REad:ధర్మం కంటే పార్టీ ముఖ్యం కాదు, మునావర్ షో ను అడ్డుకొంటాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ఇకపోతే.. మునావర్ ఫరూఖీని వేదిక వద్దే దాడి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ధర్మం కోసం అవసరమైతే పార్టీకి కూడా దూరమయ్యేందుకు తాను సిద్దంగా ఉన్నానని కూడా రాజాసింగ్ తేల్చి చెప్పారు. చాలా రాష్ట్రాల్లో మునావర్ ఫరూఖీ షో లను ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు. అన్ని పార్టీలు కూడా ఈ విషయమై ఏకతాటిపైకి రావడంతో చాలా ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఎందుకు మునావర్ ఫరూఖీ షో ని ప్రభుత్వం అనుమతించిందో చెప్పాలని ఆయన కోరారు. రాముడి, సీతను దూషించిన మునావర్ ఫో ను రాష్ట్రంలో నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడ ఆయన ప్రశ్నించారు. మునావర్ కాకుండా వేరే హాస్య కళాకారుడితో షో నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో తాము పాల్గొంటామన్నారు. కానీ ఈ షోకి అనుమతివ్వద్దని తాము కోరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.