పేస్ బుక్ లో ఓ వర్గాన్ని కించపర్చేలా పోస్ట్ పెట్టాడని బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రంజాన్ మాసంలో ముస్లీంలకు ఇచ్చే ఇప్తార్ విందులు కేవలం ఓట్ల కోసమే ఏర్పాటు చేస్తున్నారంటూ రాజాసింగ్ ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీనిపై పలు ముస్లీ సంఘాలు, ముస్లీంలు అభ్యంతరం తెలపుతుండటంతో ఆయనపై ఫలక్ నుమా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎమ్మెల్యే రాజాసింగ్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాడనే నేరంపై ఐపీసీ సెక్షన్ 152 (ఎ) కింద కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్పారు. దీనిపై తాము ఎమ్మెల్యే రాజాసింగ్ ను వివరణ కోరామని, వివరణ ఇవ్వకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ వివరించారు. 

రంజాన్‌ సందర్భంగా ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని రాజా సింగ్ కు ఒక స్నేహితుడు సూచించాడు. దీనిపై స్పందించిన ఆయన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ప్రస్తుతం చాలామంది తెలంగాణ నాయకులు ఇఫ్తార్ విందులు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. టోపీలు ధరించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాము కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయగలమని నిరూపిస్తున్నారు. అయితే, వారు ‘సబ్‌కా  సాథ్..సబ్‌కా వికాస్’ గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని రాజాసింగ్ తన వీడియో ప్రసంగంలో పేర్కొన్నారు.  

ఇలాంటి ఇప్తార్ విందులను తాను నిర్వహించబోనని, వాటికి ఎవరైనా ఆహ్వానిస్తే కూడా హాజరు కాబోనని స్పష్టం చేశారు. ఇవన్నీ ముస్లీం ల ఓట్లు పొందడానికి కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నమే ఈ ఇప్తార్ విందులు అంటూ ఆయన ఈ వీడియోలో తెలిపాడు. హిందువులను చంపేస్తున్న వారు ఇస్తున్న ఇఫ్తార్ విందులకు తానెలా హాజరుకాగలనని  ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విందు రాజకీయాలను సహంచనని రాజాసింగ్ స్పష్టం చేశారు.