బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావును గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ ఆయనపై కేసు నమోదు చేసారు.
కరీంనగర్: బిజెపి ఎమ్మెల్యే రఘునందర్ రావు (madhavaram raghunandan rao) పై మరో పోలీస్ కేసు నమోదయ్యింది. పోలీసుల విధులకు ఆటంకం కల్పించారన్న ఆరోపణలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక (dubbaka) నియోజకవర్గ పరిధిలో గురువారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ క్రమంలోనే తోగుట మండలం కుడికందుల గ్రామంలో కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.
Video
ఈ ఘటనతో ఎమ్మెల్యే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారిక కార్యక్రమం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేరా అంటూ పోలీసులపై సీరియస్ కావడమే కాదు స్వయంగా తానే మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి బిజెపి నాయకులు అక్కడికి చేరుకుంటుండంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారంటూ ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో ఎక్కించుకుని ఎమ్మెల్యేను బెజ్జంకి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎమ్మెల్యే రఘునందన్ అనుచరులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు బెజ్జంకి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఎమ్మెల్యేను పోలీసులు విడిచిపెట్టాలని... ఆయనను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. పోలీసుల తీరుకు, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగడంతో బెజ్జంకి పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీస్ స్టేషన్ లోనే ఎమ్మెల్యే రఘుునందన్ మాట్లాడుతూ... తెలంగాణ పోలీసులు పక్షపాతదోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికార టీఆర్ఎస్ నాయకులతో ఒకలా ప్రతిపక్ష పార్టీల నాయకులయితే మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పద్దతి మంచిది కాదని ఎమ్మెల్యే రఘునందన్ హెచ్చరించారు.
