పెళ్లికాని యువతీ యువకులు మ్యాట్రీమోనీ సైట్లలో డీటైల్స్ పెట్టడం చాలా కామన్. అలాంటి వారి సమాచారం తీసుకొని.. కేటుగాళ్లు మాయ చేయడం గమనార్హం. తాజాగా.. ఓ యువకుడి సమాచారాన్ని మ్యాట్రిమోని సైట్ల నుంచి సేకరించి.. అతనికి ఓ అమ్మాయితో ఎరవేసి.. రూ.లక్షలు గుంజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వివరాల ప్రకారం మెట్టుగూడకు చెందిన విక్రమ్‌ అనే యువకుడికి ఇటీవల ఓ విదేశీ ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తన పేరు పమేలా బిందే అని, యూకేలో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అంటూ నమ్మించింది. నీకు అంగీకారమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది, పెళ్లి కూడా ఇండియాలోనే చేసుకుందామని, ఖర్చులు, ఇతరత్రా కోసం రూ. కోట్లలో డబ్బు చెక్కు ద్వారా పంపిస్తానని నమ్మించింది. 

ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేసి యువకుడి నుంచి రెండు దఫాలుగా రెండు లక్షలకు పైగా డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తుండటంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.