కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. హైదరాబాద్ లోనూ ఓ కేసు నమోదైంది. దీంతో.. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు మాస్క్ లు, సానిటైజర్లు కొనేసుకున్నారు. ఎంతలా అంటే.. నగరంలో ఇప్పుడు ఎక్కడా మాస్క్ లు, శానిటైజర్లు దొరకడం లేదు. ప్రజల్లో ఉన్న భయాన్ని కొందరు ఆకతాయిలు తమ సరదా కోసం వాడుకోవడం గమనార్హం.

Also Read కరోనా వైరస్ సోకిన 100ఏళ్ల వృద్ధుడు... పూర్తిగా కోలుకొని......

ఓ రెస్టారెంట్ లో పనిచేసే కార్మికుడికి కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో... ఎవరూ ఆ రెస్టారెంట్ వైపు కూడా చూడటం లేదు. దీంతో ఆ రెస్టారెంట్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెహదీపట్నం మెరాజ్ చౌరస్తాలోని ఓ రెస్టారెంట్ లో పనిచేసే కార్మికుడికి కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చిందని రెస్టారెంట్ ఫోటోతో ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అక్కడ పనిచేసే ఇతర కార్మికుల బ్లడ్ శాంపిల్స్  కూడా వైద్యాధికారులు సేకరించారని అందులో పేర్కొన్నారు. ఆ రెస్టారెంట్ కు ఎవరూ వెళ్లొద్దంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

ఆ పోస్టు కాస్త వైరల్ కావడంతో ఆ రెస్టారెంట్ వైపు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో ఆలస్యంగా విషయం తెలుసుకున్న యజమాని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.