ప్రముఖ మ్యూజిక్ యాప్ టిక్ టాక్ ద్వారా చాలా మంది యువత క్రేజ్ సంపాదించుకున్నారు. వారిని చూసి మిగతావారు కూడా ఆ యాప్ లో సమయం గడిపేస్తున్నారు. అయితే.. అదే యాప్ కారణంగా కొందరు దారుణంగా మోసపోతున్నారు. వాటిల్లో పరిచయాలు పెంచుకొని... పీకల్లోతూ ప్రేమల్లో మునిగితేలుతున్నారు.

దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు యువతులను మోసం చేస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువతి ఓ వ్యక్తి చేతిలో అదేవిధంగా మోసపోయింది. ప్రేమిస్తున్నానంటూ టిక్ టాక్ లో చెప్పగానే నిజమని నమ్మింది. పెళ్లి చేసుకుంటాడు కదా అని సర్వస్వం అర్పించింది. చివరకు అతను వదిలేయడంతో మోసపోయానని గ్రహించింది. పాతబస్తీలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

పాతబస్తీకి చెందిన యువతి(27)కి గత డిసెంబర్ లో తలాబ్ కట్ట నషేమన్ నగర్ కి చెందిన అక్బర్ షా(34) తో టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమ పేరిట నమ్మించిన అతను పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాటలను సదరు యువతి నమ్మింది.

ఆమె నమ్మకాన్ని అవకాశంగా తీసుకున్న అతను తరచూ తన సోదరి ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని యువతి బంధువుల మధ్య నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనికి అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.