ఆపరేషన్ తో ‘వేలిముద్ర’ లు మార్చి.. అధికారులను ఏమార్చి విదేశాలకు.. తొమ్మిదిమంది అరెస్ట్..
ఆపరేషన్ చేసి వేలిముద్రలు మారుస్తున్న ఓ ముఠాలోని తొమ్మిది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ వెళ్లేందుకు రిజక్టైన వారిని అక్రమమార్గాల్లో పంపించడానికి ఇలా చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : శస్త్రచికిత్సతో చేతి వేలి ముద్రలు ఏమార్చే ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వారి సహకారంతో దేశ సరిహద్దులు దాటిన వారి గుట్టు తేల్చేందుకు సిద్ధమయ్యారు. దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరు ఇప్పటికే కువైట్ సహా మరికొన్ని దేశాలకు చేరుకున్నట్లు గుర్తించారు. వారి వివరాలు సేకరించి తిరిగి దేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా శస్త్రచికిత్సలు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఎవరెవరికి శస్త్రచికిత్స చేశారో గుర్తు పట్టలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే మరిన్ని లింకులు వెతుకుతున్నారు. పూర్తి వివరాలు వచ్చాక వారిని స్వదేశానికి రప్పించేందుకు ఆయా దేశాల రాయబార కార్యాలయాల లేఖ రాయనున్నారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల సంఖ్య తాజాగా 13కు చేరింది. తొలుత కడప జిల్లాకు చెందిన నాగమునీశ్వర్ రెడ్డి (36), బాలాజీ తిరుపతి జిల్లా తానపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకటరమణ, మరో ఇద్దరిని సెప్టెంబర్ తొలివారంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ ముఠా ఆధ్వర్యం శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు రాజస్థానీయులు, కేరళకు చెందిన ఆరుగురిని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కూడా దొరికాడు.
కేసు వెనుక అసలు కథ..
కువైట్ వంటి విదేశాలకు ఉపాధికోసం వెళ్లే వారికి ఐదేళ్లు అక్కడే ఉండేందుకు అనుమతి ( వర్క్ పర్మిట్)ఉంది. రెండోసారి వెళ్లేందుకు అనుమతి రాదు. వెళ్లేందుకు ప్రయత్నించిన వేలిముద్రల ఆధారంగా తెలుసుకుంటారు. తనిఖీలకు మూలం వేలిముద్రలే అని తెలుసుకున్న నాగమునీశ్వర్ రెడ్డి, వెంకటరమణ సరికొత్త నేరానికి తెరలేపారు. చేతి వేళ్లకు చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తారు. చికిత్స తర్వాత పాత వేలిముద్రలు తొలగిపోయి కొత్తవి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ సమయంలోనే కొత్త ఆధార్ నెంబర్ సంపాదించి వేరే చిరునామాతో మళ్ళీ వీసా తీసుకుని బయటకు వెళ్తారు. అక్కడి అధికారులకు చిక్కకుండా ఇదంతా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 1న హైదరాబాదులో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఈ ముఠా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే, ఒకసారి రిజక్ట్ అయిన యువకులు సర్జరీలతో మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా కొత్తరకం సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్ తో పాటు కొంతమంది సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.