మల్కాజిగిరి రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని ముక్కలు ముక్కలుగా నరికిన కేసులో బాధితుడి భార్య, కుమారుడు, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని హింగోలి గ్రామానికి చెందిన కిషన్ మారుతీ సుతార్ రైల్వేలో గూడ్స్ డ్రైవర్‌గా పనిచేసి అనారోగ్యం కారణంగా వీఆర్ఎస్ తీసుకున్నాడు.

అతని భార్య, ఇంట్లో ఉన్న కుమార్తె, కుమారుడు క్షయ బాధితులు. మారుతీకి వచ్చే రూ. 30 వేల పింఛన్‌పైనే వీరంతా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన మారుతీ సుతార్.. భార్య, పిల్లల అవసరాలకు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో సుతార్‌పై భార్య, కొడుకు, కూతురు కక్ష పెంచుకున్నారు. అతన్ని హత్య చేసి.... కనిపించడం లేదని అందరినీ నమ్మిస్తే పింఛను డబ్బును తామే అనుభవించవచ్చని పథకం వేశారు.

ఇందుకోసం ఇంటర్నెట్‌లో వెతికి... కొన్ని గింజలను పొడిగా చేసి నెల రోజులుగా ఆయన తినే అన్నంలో కలపడం ప్రారంభించారు. అయితే ఈ నెల 15న రాత్రి ఎక్కువ మొత్తంలో తినిపించారు.

16న ఉదయం ఆయన మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆరు బకెట్లలో నింపారు. ఎవరు చూడకుండా వాటిని ఆటోలో తరలించి సమీపంలోని చెరువులో పడేయాలనుకున్నారు. రెండు రోజుల పాటు అది వీలుకాకపోవడంతో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించింది.

స్ధానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సుతార్ ఇంటికి చేరుకుని బకెట్లలో ఉన్న శరీర భాగాలు చూసి షాక్‌కు గురయ్యారు. వీటిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి... పరారీలో ఉన్న మృతుడి కుమారుడు కిషన్, కూతురు ప్రపుళ్ల, భార్య గంగాభాయిని అరెస్ట్ చేశారు. 

తాగి వేధిస్తున్నాడని: తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి, బకెట్లలో దాచి