హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కన్నతండ్రిని చంపిన కొడుకు అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో నిల్వ వుంచాడు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన కిషన్ సుతార్ మారుతి రైల్వే శాఖలో గూడ్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసి మౌలాలీలోని ఆర్టీసీ కాలనీలో స్థిరపడ్డాడు.

ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితమే అదృశ్యమయ్యాడు. మారుతీ, అతని భార్య గయ, కుమార్తె ప్రపుల్, కుమారుడు కిషన్‌తో కలిసి ఉంటున్నాడు.

మద్యానికి బానిసైన సుతార్ ప్రతి రోజు తాగొచ్చి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ప్రపుల్ ఆరోగ్యం కూడా బాగోలేదు.. ఇదిలావుండగా ఈ నెల 16వ తేదీ రాత్రి 10 గంటలకు మద్యం సేవించి వచ్చిన కిషన్.. భార్య, కొడుకు, కూతురితో గొడవపడ్డాడు.

అతని వేధింపులు ఎక్కువ కావడంతో తండ్రిని హత్య చేయాలని ప్రపుల్ నిర్ణయించుకున్నాడు. అదే రోజు రాత్రి కిషన్‌ను ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే ఆరు బకెట్లలో దాచి వుంచాడు.

కాగా... గత రెండు రోజులుగా మారుతీ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు... ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వున్న ఆరు బకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఆరు ప్లాస్టిక్ డ్రమ్ములను వాడటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.